పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యాత్మతోపాటు మనమూ దేవుని తండ్రి అని పిలుస్తామనీ చెప్పాడు - గల 4,6. ఆ యాత్మ మన హృదయంలో ప్రార్ధనం చేస్తూంటుంది. క్రీస్తు స్వర్గంలో పిత సమక్షంలో మనకోసం ప్రార్ధనం చేస్తుంటాడు - హెబ్రే 7,25. ఆత్మ మాత్రం మన హృదయంలోనే ప్రార్ధనం చేస్తూంటుంది- రోమా 8, 27. ఆత్మప్రార్ధనం, మనం పితపట్ల బిడ్డల్లాగ ప్రవర్తించాలనే.

ప్రాత యిప్రాయేలు యావే పుత్రులై నందున వాగ్లత్త భూమిని వారసంగా పొందారు. క్రొత్తయిస్రాయేలీయులమైన మనమును దేవుని పుత్రులమైనందున మోక్షాన్ని వారసంగా పొందుతాం. క్రీస్తుతో పాటు మనమూ ఈ మోక్షానికి వారసులమౌతాం. క్రీస్తుతోపాటు పుత్రులమైతే అతనితోపాటు వారసుల మౌత్తాం-రోమా 8, 17. మనం ఈ లోకంలో వున్నంతకాలం ఈ వారసం పూర్తిగా లభింపదు. మరణానంతరంగాని మోక్షాన్ని పొందలేం. కాని ఈ వారసానికి గురుతుగా తండ్రి తన ఆత్మను మన హృదయాల్లో వుంచాడు. అందుకే ఎఫేసీయుల జాబు “మీరు ఆత్మచేత ముద్రింపబడ్డారు. ఈ యాత్మ మన వారసానికై ఈయబడిన సంచకరువు" అంటుంది – 1,14 సంచకరువు లేక బయానా తరువాత ఈయనున్న మొత్తం రొక్మానికి గురుతు. అదే రీతిగా ఈ యాత్మ కూడ భావిలో మనం పొందునున్న పూర్ణమహిమకు, అనగా మోక్ష భాగ్యానికి గురుతు. జ్ఞానస్నానం నుండి గూడ పావనాత్మ మనలను మోక్షభాగ్యానికి తయారుచేస్తూంటుంది. పుత్రులం గనుక ఆత్మ మనలను ఈ మోక్షవారసానికి సిద్ధం చేస్తుంటుంది.

ఇంతవరకు మనం చూచిన విషయాల సారాంశం ఇది. మానుష కుటుంబంలో దత్తపుత్రులు తండ్రి ఆస్తిమీద హక్కును పొందుతారేగాని ఆ తండ్రి స్వభావంలో పాలు పొందరు. తండ్రి తన బుద్ధి శక్తినిగాని ఆలోచనాశక్తినిగాని దత్తపుత్రునికి ఈయజాలడు. ఆ కుమారుని పుట్టుక గూడ తండ్రినుండి కాదు.

కాని దైవకుటుంబంలో ఈలాకాదు. మనం దేవుని పుత్రుల మవడంద్వారా దేవుని మోక్షానికి హక్కుదారులం కావడం మాత్రమేగాదు, ఆ దేవుని స్వభావంలో కూడ పాలుపొందుతాం. ఆ దేవునినుండి క్రొత్త పుట్టుకను పొంది ఆ దేవునివలె దివ్యజీవితం జీవిస్తాం. అందుకే యోహాను తన తొలిజాబులో “మనం దేవుని బిడ్డలమని పిలవబద్ధం మాత్రమే కాదు యథార్థంగానే దేవుని బిడ్డలం" అన్నాడు — 3,1.

భగవంతుని కృప ద్వారా మనం అతని బిడ్డలమౌతూన్నాం. యోహాను తొలి జాబులో “దేవుని నుండి పుట్టిన వాళ్ళల్లో అతని బీజం వుంటుంది" అన్నాడు - 8, 9, ఈ బీజమే వరప్రసాదం. ఈ వరప్రసాదం ద్వారా దేవునితో ఐక్యమౌతాం, మాతృగర్భంలోని పిండం తల్లి జీవితం జీవించినట్లే మనమూ దేవుని జీవితం జీవిస్తాం. అందుకే పేత్రు రెండవ జాబుకూడ మనం భగవంతుని స్వభావంలో పాలుపొందుతామని చెప్తుంది - 1,4