పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. వివాహ సంస్కారాన్ని ఇచ్చేదెవరు?

జ్ఞానస్నానం మొదలైన దేవద్రవ్యానుమానాలను గురువు ఇస్తారు. కాని వివాహ దేవద్రవ్యానుమానాన్ని వధూవరులే ఒకరినొకరు ఇచ్చుకొంటారు. మామూలుగా క్రెస్తవ వివాహానికి గురువు హాజరుకావాలి. కాని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అతడు లేకపోయినా చెల్లుతుంది. కనుక గురువు ఈ దేవద్రవ్యానుమానాన్ని ఈయడని గ్రహించాలి. కొందరు వేదశాస్త్రులు గురువు ఆశీర్వాదం వలన వివాహ సంస్కారం జరుగుతుందని వాకొన్నారు ఇది పొరపాటు.

జ్ఞానస్నానం పొంది వుండడం వలన వధూవరులకు జ్ఞానస్నాన యాజకత్వం వుంటుంది. ఈ యాజకత్వం ద్వారానే వాళ్ళు ఒకరికొకరు వివాహసంస్కారాన్ని ఇచ్చుకొంటారు. ఒకరికొకరు వరప్రసాదకారకులూ, రక్షణ సాధకులూ ఔతారు.

వివాహ సంస్కారం ఇద్దరు వ్యక్తులు ఇచ్చిపుచ్చుకొనేది. భార్యాభర్తలు ఒకరికొకరు ఈ సంస్కారాన్ని ఇస్తారు. ఒకరినుండి ఒకరు దీన్ని పొందుతారు. పరస్పరాంగీకారాన్ని తెలిపి వివాహ సంస్కారాన్ని జరుపుకొన్నపుడు ఆలుమగలమధ్య ఆధ్యాత్మిక బంధం ఏర్పడుతుంది. ఐక్యత సిద్ధిస్తుంది. ఆ క్షణంనుండి వాళ్ళు జీవితంలోవచ్చే సుఖదుఃఖాలను కలిసే అనుభవిస్తారు.

మూమూలుగా మన క్రైస్తవవివాహం పూజలో జరగుతుంది, పూజలో జరగనపుడుకూడ గురువు సాధారణంగా వివాహానికి హాజరుకావాలి. అతడు క్రెస్తవ వివాహానికీ దాని పావిత్ర్యానికీ సాక్షిగా వుంటాడు. అసలు వివాహ సంస్కారాన్ని జరిపే ప్రధానవ్యక్తి ఉత్దాన క్రీస్తే, వివాహానికి హాజరైన గురువు ఈ క్రీస్తు సాన్నిధ్యాన్ని సూచిస్తుంటాడు.

మనది ల్యాటిన్ (పశ్చిమ) తిరుసభ, మన దైవశాస్త్రం ప్రకారం వధూవరుల అంగీకారం వలననే వివాహం దేవద్రవ్యానుమానమౌతుంది. కాని ప్రాచ్య తిరుసభ దైవశాస్త్రం ప్రకారం, వివాహం దేవద్రవ్యానుమానం కావాలంటే వధూవరుల అంగీకారంతోపాటు గురువు ఆశీర్వాదం కూడా వుండాలి. అది ఆ క్రెస్తవుల ప్రత్యేకత.

పెండ్లితంతు ముగిసాక ఏ కారణం చేతనయినాసరే భార్యాభర్తలు తమ కళ్యాణాన్ని రద్దు చేసికోవాలంటే కుదురుతుందా? భార్యాభర్తలు శారీరకంగా కలసికొన్నతర్వాత ఆ వివాహాన్ని రద్దుచేయడానికి వీల్లేదు. శారీరక సంయోగంద్వారా క్రీస్తు తిరుసభల పోలికవాళ్ళమీద పరిపూర్ణంగా సోకుతుంది. వాళ్ళిద్దరూ పరిపూర్ణంగా ఏకశరీరం, ఏకవ్యక్తి ఔతారు. కాని శారీరకంగా కలసికోకపూర్వం కొన్ని నియమాల ప్రకారం వివాహాన్ని రద్దుచేయవచ్చు. ఈదశలో కళ్యాణం ఇంకా అపరిపూర్ణ స్థితిలోనే వుంటుంది.