పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఒకరినొకరు పెండ్లి యాడ్డానికి సిద్ధంగా వున్నామని సూచిస్తూ తమ అంగీకారాన్ని తెలియజేస్తారు. ఈ యంగీకారాన్ని తెలియజేయమని ఎవరూ వారిని నిర్బంధం చేయగూడదు. వధూవరులు స్వేచ్చగా తమ సమ్మతిని తెలియజేయాలి. ఇంకా, వారి వివాహాన్ని రద్దుచేసే అవరోధాలు కూడ ఏమి వుండకూడదు.

తిరుసభ బోధల ప్రకారం, వధూవరులను భార్యాభర్తలను చేసేది ఈ యంగీకారమే. కనుక ఈ యంగీకారం వున్నపుడు నిజమైన వివాహం జరిగినట్లే, ఈ సమ్మతి లేనపుడు నిజమైన వివాహం జరగనట్లే. ఈ యంగీకారం వలననే క్రైస్తవ వివాహం దేవద్రవ్యానుమానం ఔతుంది.

గుడిలో పీఠంముందు వధూవరులు తమ సమ్మతిని ఈలా తెలియజేస్తారు. “రాజారావునైన నేను శాంతవైన నిన్ను భార్యగా చేసుకొంటున్నాను. - శాంతనైన నేను రాజారావువైన నిన్ను భర్తగా చేసుకొంటున్నాను. కష్టంలోను సుఖంలోను, వ్యాధిలోను సౌఖ్యంలోను నేను నీపట్ల విశ్వసనీయుడనుగా (విశ్వసనీయురాలినిగా) మెలుగుతానని మాట యిస్తున్నాను. నేను ప్రతినిత్యం నిన్ను ప్రేమించి గౌరవిస్తాను". ఈ యంగీకార వాక్యాలద్వారా స్త్రీ పురుషులు భార్యాభర్తలౌతారు. ఆ యిద్దరూ వివాహబంధం ద్వారా ఏకవ్యక్తిగా ఐక్యమైపోతారు. వివాహం సాంగ్యంలోకెల్ల ఈ యంగీకార వాక్యాలు అతి ముఖ్యమైనవి,

కనుక వధూవరులు ఈ వాక్యాలను హృదయపూర్వకంగా వెలిబుచ్చాలి. వాళ్ళు ఇతరుల వలన నిర్బంధానికీ గురైకాని, ఇతరులకు భయపడికాని ఈ వాక్యాలను ఉచ్చరించకూడదు. ఇతరుల నిర్భంధానికి గురై వెలిబుచ్చిన అంగీకారం నిజమైన అంగీకారం కానేరదు, ఆ పెండ్లికూడ నిజమైన పెండ్లికాదు. నిర్బంధంతో వెలిబుచ్చిన అంగీకారం పెండ్లిని రద్దు చేస్తుంది.

వివాహపూజను జరిపే గురువే వధూవరుల అంగీకారాన్ని తిరుసభ పేరిట స్వీకరిస్తారు. "తిరుసభ సమక్షంలో మీరు మీ సమ్మతిని వెల్లడిచేసారు. ప్రభువు దానిని దయతో దృఢపరచి మీకు సంపూర్ణాశీర్వాదాన్ని దయచేయునుగాక. సర్వేశ్వరుడు జతపరచిన జంటను మనుష్యమాత్రుడు వేరుపరపకుండుగాక" అని ఆశీర్వదిస్తారు. ఈలా గురువు, వివాహనికి సాక్షులుగావున్నపెద్దలుకూడ పెండ్లి తిరుసభ పేరిట జరిగిందని ధృవపరుస్తారు. యువతీ యువకులు ఎప్పడుకూడ గుడిపెండ్లి చేసికోవాలి. తిరుసభ యిచ్చే వరప్రసాదం భార్యాభర్తలమిదికి, వారికి కలుగబోయే బిడ్డలమీదికికూడ దిగిరావాలి.