పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఐనా పోపుగారికి పవిత్రగ్రంధానికిమించిన అధికారం ఏమీలేదు. ఆయన అధికారపూర్వకంగా ప్రకటనం చేసేది బైబులు సేవకొరకే, బైబులుబోధలు స్పష్టంగాను నిర్దుష్టంగా ప్రలజకు తెలియజేయడం కొరకే. కనుక పోపుగారి బోధలను మనం సేవగా గ్రహించాలేకాని అధికార శాసనాలుగా అర్థం చేసికోగూడదు.

కొన్ని మతాల్లో ఏమి నమ్మాలో ఏమి నమ్మకూడదో కూడ ఎవరికీ స్పష్టంగా తెలియదు. కనుక ఏక మతానికి చెందినవాళ్ళే నమ్మకాల విషయంలో ఒకరితో ఒకరు పోట్లాడుకొంటారు. కాని క్యాతలిక్ మతంలో ఈ చిక్కులేదు. మనం విశ్వసించవలసిన విషయాలను పోపుగారు, క్యాతలిక బోధన సంఘంవారు స్పష్టంగా బోధిస్తారు. దీనివలన మనకు అపార్థాలూ సందేహాలూ తొలగిపోతాయి. కనుక విశ్వాసులు ఈ బోధను ఓ సేవగా భావించాలి.

ఈ యధ్యాయాంతంలో ఈ చిన్న విషయాన్ని గూడ గ్రహించాలి. పోపుగారు ఎప్పడూ అధికార పూర్వకంగానే బోధించరు. అనధికారంగా గూడ బోధిస్తారు. అసలు ఈలాంటి బోధలే ఎక్కువ. ఈ బోధలను గూడ మనం వినయ విధేయతలతో స్వీకరించాలి. పోపుగారు తిరుసభ బోధన సంఘంలో ప్రధానుడు. ఆయన బిషప్పలూ కలసి ఈ బోధన సంఘమౌతుంది. ఈ సంఘాధిపతిగానే పోపుగారు మనకు బోధిస్తారు. క్రైస్తవులకు విశ్వాస సత్యాలను బోధించే అధికారం ప్రధానంగా పోపుగారికే వుంది. ఆయన బోధల్లో ఎప్పడూ పవిత్రాత్మ సాన్నిధ్యం వుంటుంది. ఆత్మ ప్రధానంగా ఆయన ద్వారా క్రైస్తవులతో మాట్లాడుతుంది. కనుక పోపుగారి బోధలను ఏమంచి క్రైస్తవుడూ పెడచెవినిబెట్టడు.

మేత్రాసనంలో పోపుగారికి బదులుగా బిషప్పుగారు మనకు బోధచేస్తారు. ఆయన మేత్రాసనంలో ప్రధాన యాజకుడు, క్రీస్తు ప్రతినిధి అని చెప్పాం. కనుక బిషప్పుగారి బోధలను కూడ మనం వినయవిధేయతలతో, విశ్వాసంతో అంగీకరించాలి.

ఓ వేదసత్యాన్ని గూర్చికాని, నైతికాంశాన్ని గూర్చికాని మనకు సందేహం కలిగినప్పడు, వెంటనే ఆయంశాన్ని గూర్చి మన కిష్టమొచ్చినట్లుగా విమర్శించి ఖండించకూడదు. తెలిసిన వాళ్ళనుండి దాని భావాన్నీ పూర్వాపరాలనూ లోతుపాతులనూ గ్రహించే ప్రయత్నం చేయాలి. అది మన బుద్ధికి మించిన వేదసత్యమైతే వినయంతో దానికి తలవంచాలి. అది మనకు కష్టాన్నో నష్టాన్నో తెచ్చిపెట్టే నైతికాంశమైతే, స్వార్థాన్ని విడనాడి దానికి కట్టుపడివుండాలి. మంచి క్రైస్తవులకు నియమాలు ఇవి.