పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4 సంతాన దృష్టి

తోబియా సారాను పెండ్లాడాడు. పెండ్లినాటిరాత్రి సారా తోబియా దగ్గరకు వచ్చింది. అప్పడు తోబియా "ప్రభూ! ఆదామునకు ఏవను సహాయురాలినిగా అనుగ్రహించావు. వారిద్దరి వలన మానవలోకం ఉద్భవించింది. నేను సారాను ఈ దినం భార్యగా స్వీకరిస్తున్నాను. కామతృప్తికోసంగాక సంతానాన్ని పొందడంకోసం ఈవిడను గ్రహిస్తున్నాను. ముసలిప్రాయం వరకూ నేను ఈవిడతో కూడి జీవింతునుగాక" అని ప్రార్థించాడు. ఆ ప్రార్థనకు సార ఆమెన్ అని జవాబిచ్చింది. బైబుల్లోని స్త్రీ పురుషులు సంతానంపట్ల చూపే వాంఛ యిలా వుంటుంది - తోబీ 8,5–9.

5. సహాయురాలు

ఆదాముకోసం యోగ్యురాలైన సహాయురాల్ని సృజించాలనుకున్నాడు యావే. ఈ సందర్భంలో “సహాయరాలు" అంటే 1. ఆదామునకు దగ్గరి బంధువురాలు. ఆమె అతని ఎముకనుండి పుట్టింది. 2. ఆమెద్వారా కాని అతడు పరిపూర్ణుడు కాలేడు. ఆమెతో అతడు లైంగిక సంబంధం ఏర్పరచుకొని బిడ్డలను కనాలి. కర్రమీద ఆధారపడే వృద్దునిలాగ ఆమెమీద అతడు ఆధారపడాలి. ఒక్క వాక్యంలో చెప్పాలంటే, వాళ్ళిద్దరు ఒకే వ్యక్తిగా ఐక్యమైపోవాలి. భార్యాభర్తల సంబంధం, సన్నిహితత్వం ఈలాంటిది.

6 హెచ్చుతగ్గులు

భగవంతుని సృష్టి ప్రణాళికరీత్యా స్త్రీ పురుషుల శక్తి సామర్థ్యాల్లో భేదం వుంది. లింగభేదమూవుంది. సమాజంలో వాళ్లు చేయవలసినపనులుకూడా భిన్నభిన్నంగా వుంటాయి. కాని వాళ్ళిద్దరి విలువల్లో భేదం లేదు. స్త్రీ పురుషులు ఇద్దరూ దేవుని బిడ్డలే. దేవుని యెదుట యిద్దరూ సమానులే. యావే ఆదాము ఏవలను సృజించి వారికి “నరులు" అని పేరు పెట్టాడు. అనగా ఈ వాక్యంలో నరశబ్దం ఇద్దరకూ వర్తిస్తుంది. ఇద్దరు సమానులే-ఆది 228. స్త్రీకి పురుషుడు ఎంత అవసరమో, పురుషునికి స్త్రీకూడా అంత అవసరం-1కొ 11,11. పైగా క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందినవాళ్లు లింగభేదాన్ని అతిక్రమించి సమానమైన హోదాను పొందుతారు - గల 3.28.

7. భార్య భర్తకు బానిస ఔతుందా?

ఆదిదంపతులు పాపంచేసాక, యావే ఏవను చూచి నీవు నీ భర్తకు బానిస అవుతావని శపించాడు - ఆది 3,16. కాని యిది ఏవ దుష్కర్మవలన కలిగిన శిక్ష పాపఫలితం. స్త్రీ సామాన్యధర్మం కాదు. కావున క్రైస్తవభార్య భర్తకు సహాయురాలుగాని భానిసకాదు. అందుచే క్రైస్తవభర్త భార్యను స్నేహితురాలునిగా భావించాలి.