పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇతరమతాల్లో వున్నా క్రీస్తు వరప్రసాదం సోకిన సజ్జనుల బృందంకూడ ఇప్పడు ఇవిరెండూ లోకంలో నెలకొని వున్నాయి. తిరుసభ సంపూర్ణంగా దైవరాజ్యంలో ఇమిడి వుంది. కాని దైవరాజ్యం తిరుసభలో ఇమడదు. అవిరెండూ వేరువేరు సంస్థలు.
నరులంతా సువిశేష విలువల ప్రకారం జీవించాలి. ఈ విలువలు తిరుసభలో ఎక్కువగా వుంటాయి. కాని యివి అన్యమతాల్లోగూడ వుండవచ్చు. ఇవి వున్నచోటల్లా దైవరాజ్యం కూడ వుంటుంది.
మనం చేరవలసిన చివరి గమ్యం తిరుసభ కాదు, దైవరాజ్యం. తిరుసభ తన బోధలద్వారా సేవలద్వారా సాక్ష్యంద్వారా మనలను దైవరాజ్యంలోనికి చేరుస్తుంది. అసలు తిరుసభ మనలను దైవరాజ్యానికి సిద్ధం చేయడానికే వుంది.
3. లోకాంతంలో తిరుసభ ఏమౌతుంది? లోకాంతంలో దైవరాజ్యం వచ్చినపుడు తిరుసభ అంతంకాదు. తానూ ఆ దైవరాజ్యంలో లీనమైపోతుంది. నూత్నవేదం తిరుసభ అంతాన్ని ఓ వివాహంగా భావిస్తుంది. లోకాంతంలో క్రీస్తు తిరుసభ అనే వధువుని పరిణయమాడతాడు - 2కొ 11,2. అనగా తిరుసభ క్రీస్తుతోను అతని దైవరాజ్యంతోను ఐక్యమైపోతుందని భావం, దర్శనగ్రంథం తిరుసభను క్రీస్తుతోడి వివాహానికి సిద్ధమైన వధువునుగా వర్ణిస్తుంది - 19,7.212. ఈ వధువుకి పరలోకపు యెరూషలేమని పేరు. ఇదే పరిపూర్ణమైన తిరుసభ. ఇదే దైవరాజ్యంకూడ.
ఈ విధంగా ఇహలోక జీవితంలో తిరుసభ దైవరాజ్యానికి సాధనంగా వుంటుంది. పరలోక జీవితంలో తానూ ఆ రాజ్యంలో కలసిపోతుంది.

ప్రార్థనా భావాలు

1. బైబులు తిరుసభకు చాల వుపమానాలు వాడుతుంది. అది క్రీస్తు అనే కాపరి • మేపే మంద - యోహా 10,11. దేవుడు నాటిన ద్రాక్షతోట - మత్త 21,33– 43. దేవుడు నిర్మించిన భవనం - 1కొ 8,9. ఈ భవనంలోనే మనం వసిస్తాం. ఇంకా అది గొర్రెపిల్ల వధువు -దరు 19,7, 21,2. మనకందరికి తల్లి, ఈలాంటి తిరుసభపట్ల మనకెంతో భక్తి వుండాలి,
2. ఇప్పుడు మనం ఆరాధనకు దేవాలయానికి వెత్తాం. కాని తొలిరెండు శతాబ్దాల్లోను రాతిగుళ్ళు లేవు. క్రైస్తవులు కొందరు భక్తుల యిండ్లల్లోనే ప్రోగై ఆరాధన జరుపుకొనేవాళ్లు, ఆయిందే తొలినాటి దేవాలయాలూ తిరుసభలూ కూడాను. ఈ గృహ దేవాలయాల పద్ధతిని నేడు మల్లా పునరుద్ధరించాలి. క్రైస్తవులు ఆయా భక్తుల యిండ్లల్లో ప్రోగై ప్రార్థనలు జరుపుకొంటే క్రైస్తవ సమాజాలు బలపడతాయి. తిరుసభలో ఐక్యత పెరుగుతుంది. దైవసాన్నిధ్యం బలంగా నెలకొంటుంది.మౌలికసంఘాలు వృద్ధిలోకి వస్తాయి.