పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4. తిరుసభ ఎల్లరికీ రక్షణసాధనం

ముందటి అధ్యాయంలో తిరుసభ దైవరాజ్యానికీ సాధనంగా వుంటుందని చెప్పాం. రెండవ వాటికన్ సభ అది యెల్లరికీ రక్షణసాధనమని చెప్తుంది. ఈ యధ్యాయంలో అది యెల్లరికీ రక్షణ సాధనమం ఏలా ఔతుందో పరిశీలిద్దాం. ఇక్కడ మూడంశాలు వున్నాయి.

అందరూ రక్షణం పొందాలనే దేవుని కోరిక -1తిమో 2,4. అతడు సమస్తాన్ని క్రీస్తుకి పోలికగానే సృజించాడు. కనుక అందరూ క్రీస్తుని చేరాలనే దేవుని కోరిక - కొలో 1,15-16. క్రీస్తు పట్టకముందే, యిప్రాయేలీయులు పుట్టకముందే, దేవుడు మానవ రక్షణాన్ని ప్రారంభించాడు. కనుక తిరుసభకు వెలుపలా, తిరుసభ పుట్టక ముందుకూడ రక్షణం వుంది. ఐనా ఈ రక్షణాన్ని గూర్చిన దివ్యశ్రుతి మాత్రం ఒకదేశంలో, ఒకకాలంలో, ఒకజాతితో ప్రారంభమైంది. అది యిస్రాయేలు జాతి. ఆ ప్రజనే దేవుడు తన దాన్నిగా యెన్నుకొన్నాడు. ఆ జాతిలోనే క్రీస్తు పుట్టాడు. దేవుడు అతన్ని రక్షణ కర్తనుగా నియమించాడు. ఆ క్రీస్తు రక్షణ సాధనంగా తిరుసభను ఏర్పాటు చేసాడు. ఐనా ప్రాచీనకాలంలోగాని ఆధునికకాలంలోగాని ఈ తిరుసభను గూర్చి కొద్దిమందికే తెలుసు. మరి అది యెల్లరికి రక్షణ సాధనం ఏలా ఔతుంది?

తిరుసభ అందరికి రక్షణ సాధనం అన్నాం. మొదట "రక్షణం" అంటే యేమిటో చూద్దాం. ఇక్కడమనం పేర్కొనే రక్షణం కేవలం పాపపరిహారం మాత్రమేకాదు. రక్షణమంటే ఇహపరాల్లోను శాంతి, ఆనందం, సౌభాగ్యం అనుభవించడం. ప్రభువు తానొచ్చింది జీవవిరాయడానికీ ఆజీవాన్ని సమృద్ధిగా ఈయడానికీ అన్నాడు - యోహా 10,10. కనుక ఇహపరాల్లోను క్రీస్తునుండి శాశ్వత జీవాన్ని పొందడమే రక్షణం.

ఇక తిరుసభ “రక్షణ సాధనం" అంటే యేమిటో చూద్దాం. తిరుసభ అందరికీ రక్షణ చిహ్నం లేక వరప్రసాదచిహ్నం ఔతుంది. అనగా అది అందరి రక్షణానికి గురుతుగాను సాధనంగానూ వుంటుంది. అంటే అందరు దానినుండే రక్షణం పొందుతారని భావం.

1. క్రీస్తే మొట్టమొదటి రక్షణసాధనం

దేవుడే క్రీస్తుని రక్షణ కర్తనుగా నియమించాడు. అతడు తండ్రికి ప్రతినిధి. తండ్రి ప్రేమకు గురుతు. క్రీస్తుని చూస్తే తండ్రిని చూచినట్లే. అనగా దేవుడు అతనిద్వారా మనకు దర్శనమిస్తాడు - యోహా 14,9. ఈ క్రీస్తు దేవుడూ నరుడూ కూడ. కనుక అతడు దేవునికీ నరునికీ మధ్య మధ్యవర్తి అయ్యాడు. తండ్రి అతనిద్వారా అన్నిటినీ తనతో రాజీ పరచుకొన్నాడు - కొలో 1,20.