పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హృదయాలర్పించుకొంటూ వుంటారు. మాటల ద్వారా సంజ్ఞల ద్వారా పరస్పరం సంబంధం కలిగించుకొంటూ వుంటారు. చైతన్యవంతమైనది కనుక ఇది విలువైన సాన్నిధ్యం. దీనిలో పరస్పరాంగీకారం వుంటుంది. ఇచ్చి పుచ్చుకోవడాలు వుంటుంది. ఈ సాన్నిధ్యం రోజురోజుకీ బలపడుతుంది, పెంపజెందుతుంది. వ్యక్తులిద్దరూ ఒకరి హృదయంలో ఒకరు నివాసమేర్పరచుకొంటారు. ఈ సాన్నిధ్యం కేవలం భౌతికమైనదే కానక్కరలేదు, కేవలం సమీపంలో వున్నదే కానక్కరలేదు. మనకిష్టమైన వ్యక్తి దూరంగా వున్నా మన దగ్గరలో, మన మనసులో వున్నట్లుగా భావిస్తాం.

ఇక దివ్యసత్రసాదంలో క్రీస్తు సాన్నిధ్యం స్థానికమైంది కాదు. వ్యక్తిగతమైంది. ఇక్కడ ప్రభువు మనలను ప్రేమిస్తూ తన్ను తాను మనకు ఆత్మార్పణం చేసికొంటూ వుంటాడు. ప్రభువు శ్రీసభలో నానారూపాల్లో సాక్షాత్కారమై వుంటాడు. కాని ఆ సాక్షాత్కారాలన్నిటిలోను ఈ దివ్య సత్రసాద సాక్షాత్కారం విలువైంది. ఇతర సాక్షాత్కారాల్లో ఆ ప్రభువు వరప్రసాద ముంటుంది కాని యిక్కడ అతడే స్వయంగా నెలకొని వుంటాడు.

సాన్నిధ్యానికి ఆత్మార్పణం ముఖ్యం. క్రీస్తు పూజను నెరవేర్చే భక్త సమాజంలో సత్ర్పసాద రూపంలో ప్రత్యక్షమై వుంటాడు. అతడు తన్ను తాను ఆ సమాజానికి అర్పించుకోగోరుతూంటాడు. ఆ భక్తసమాజం గూడ అతన్ని అంగీకరించడానికి స్వీకరించడానికీ సిద్ధంగా వుండాలి. ఎప్పుడు కూడ ప్రభువు తన్నుతాను అర్పించుకొనేవాడు. భక్తులమైన మనం అతన్ని స్వీకరించేవాళ్ళం. అతనికి హృదయాలు అర్పించుకొనేవాళ్ళం. అతడు మన దగ్గరికి రావడానికి ఇష్టపడతాడు. మనం కూడ అతని చెంతకు పోవడానికి ఇష్టపడాలి. అతన్ని పొందడానికి ఉవ్విళ్ళూరాలి.

సత్రసాదంలో క్రీస్తు వట్టినే జడాత్మకంగా వుండిపోడు. మరి చైతన్యవంతంగా, తన్ను తాను మన కర్పించుకొంటూ వుంటాడు. మన తరపున మనంకూడ ఆ ప్రభువు నెదుట జడాత్మకంగా వుండిపోగూడదు. చైతన్యవంతంగా అనగా అతన్నిస్వీకరిస్తూ వుండాలి. భక్తిభావంతో అతనికి హృదయాలు అర్పించుకొంటూ వుండాలి.

ప్రార్థనాభావాలు

1. శ్రీసభలో క్రీస్తు సాక్షాత్కారాలు నానారూపాల్లో వుంటాయని చెప్పాం. ఏమిటివి ఈ నానారూపాలు? ఆరాధన సందర్భానికి చెందిన సాన్నిధ్యాలు నాలున్నాయి. 1. ప్రభువు తన్ను ఆరాధించడానికి ప్రోగైన భక్తసమాజంలో నెలకొని వుంటాడు. ఎక్కడెక్కడ నా పేరు మీదిగా ఇద్దరు ముగ్గురు సమావేశమౌతారో వారి మధ్యలో నేనూ నెలకొని వుంటాను అన్న వేదవాక్యం గూడ వుంది - మత్త 18,20.