పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1. పరిచయం

ఈ కీర్తనం స్తుతిగీతాల వర్గానికి చెందింది. ఇది ప్రధానంగా భగవంతుని కరుణను వర్ణిస్తుంది. కంటికి కన్పించని ఆ దేవుణ్ణి కంటికి కన్పించేలా చిత్రిస్తుంది. ఈ కీర్తనను చెప్పిన భక్తుడు దేవుని దయను బాగా అనుభవానికి తెచ్చుకొన్నాడు. అతని అనుభవం ఎంత విలువయిందంటే, అది యీనాడు మనం కూడ ఆ ప్రభువు దయను అర్థం చేసికొనేలా చేస్తుంది. ఈ గీతంలోని చాల వాక్యాలు బైబుల్లోని ఇతర గ్రంధాల నుండి గ్రహింపబడినవే. ఐనా అవి చాల ప్రశస్తమైనవి. భక్తుల హృదయాంతరాళం నుండి వెలువడినవి. దీనిలోని చాల చరణాలను మనం సంగ్రహ ప్రార్థనలుగా, సుకృత జపాలుగా వాడుకోవచ్చు.

2. విభజనం

1-2 కీర్తనకారుడు దేవుణ్ణి స్తుతించడానికి తన్నుతాను ఆహ్వానించు కొంటున్నాడు.
3-5 అతడు ప్రభువు కరుణను స్వయంగా అనుభవానికి తెచ్చుకొన్నాడు.
6-14 యూదులకు దేవుడు కరుణజూపిన తీరు
15-18 నరుడు అనిత్యుడు, దేవుడు నిత్యుడు
19–22 దేవుడు రాజు

3 వివరణం

1-2 కీర్తనకారుడు తన యాత్మను, అనగా తన్నుతానే దేవుణ్ణిస్తుతించడానికి ఆహ్వానించుకొంటున్నాడు. ఆ ప్రభువు తనకు చేసిన ఉపకారాలను వేటినీ తాను మరువరాదని అనుకొంటున్నాడు.
3-4. ఆ భక్తుడు తన జీవితంలో ప్రభువు కరుణను స్వయంగా అనుభవానికి తెచ్చుకొన్నాడు. ఏలాగనగా, ప్రభువు అతని పాపాలు మన్నించాడు. అతని వ్యాధులు కుదిర్చాడు. అకాల మృత్యువాతబడకుండా అతన్ని కాపాడాడు.
5. గరుడపక్షిలో రెండు లక్షణాలు ఉంటాయి. 1. ఎటేట ఈకలు రాల్చగానే దానికి నూత్నబలం వస్తుంది. 2. అది దీర్ఘకాలం జీవిస్తుంది. కనుక కీర్తనకారుడు ప్రభువు తనకుకూడ యువకుల బలమూ, దీర్గాయువూ దయచేస్తాడని నమ్మాడు.
6. ఇక యూదుల చరిత్రలో ప్రభువు కృపజూపిన తీరును వర్ణిస్తున్నాడు. ఈ కీర్తనలో ఇదే ముఖ్యాంశము.