పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

27. ఆత్మా దైవవాక్కు

1. ప్రాచీనకాలంనుండి భక్తులు బైబులు చదువుకొనేపుడు ఆత్మకు ప్రార్థన చేస్తూ వచ్చారు. పూర్వం యిర్మీయా యెషయా మత్తయి మార్కు మొదలైన పరిశుద్ధ రచయితలకు ప్రేరణం పట్టించి వారిచే బైబులు వ్రాయించింది పవిత్రాత్మే కనుక ఆ యాత్మ అనుగ్రహం లేందే ఎవరికీ పవిత్రగ్రంథం వశపడదు. బైబులు ఆధ్యాత్మిక విషయాలు చెప్పే పుస్తకం. ఆత్మ సహాయంలేందే ఆధ్యాత్మిక విషయాలు ఎవరు అర్థం చేసికోగలరు? ఆత్మ రెండు ప్రేరణలు దయచేస్తుంది. ఒకటి రచయితకీ, మరొకటి పాఠకుడికీ, రచయితకు కలిగే ప్రేరణం దివ్యగ్రంథాలు వ్రాయడానికి, మత్తయి మార్కు మొదలైనవాళ్ళు ఈ ప్రేరణంతోనే సువిశేషాలు వ్రాసారు. పాఠకులకు కలిగే ప్రేరణం బైబులు చదవడానికి, ఈ ప్రేరణం వల్ల మనం మళ్ళా బైబులు వ్రాయం. ఇదివరకే వ్రాసిన బైబులు చాలు. ఈ ప్రేరణంవల్ల మనం బైబులు అర్థం చేసికొంటాం. దానిపట్ల భక్తి కలిగించుకొని దాని బోధల ప్రకారం జీవిస్తాం. కనుక బైబులు చదువుకొనేపుడు మనం ఈ ప్రేరణను బాగా వాడుకోవాలి. 2. పౌలు బోధిస్తుంటే లూదియా అనే భక్తురాలు వింది. ప్రభువు ఆమె హృదయాన్ని తలుపు తెరచినట్లుగా తెరచాడు - అచ 16,14. ఈనాడు మనం బైబులు చదువుకొనేపడు ఆత్మ మన హృదయాన్ని కూడ ఈలాగే తెరుస్తుంది. లేకపోతే మనకు భక్తి పట్టదు. యోహాను మొదటి జాబు మీరు పవిత్రుని వలన అభిషేకింపబడ్డారు అని చెప్తుంది - 2,20. అతనినుండి మీరు పొందిన అభిషేకం మీయందు నిల్చివుంది అంటుంది - 2,27. ఈ రెండు అలోకనాలు పేర్కొనే "అభిషేకం" పవిత్రాత్మ ప్రభావమే. మనం మొదట వేదవాక్యం వింటాం. అది విత్తనంలా మన హృదయంలో పడుతుంది. ఆత్మ మన హృదయంలో పడిన ఈ వేదవాక్యాన్ని మనకు వివరిస్తుంది. దీనివలన మన హృదయంలో భక్తి పడుతుంది, మనం క్రీస్తుని విశ్వసిస్తాం. ఈ ప్రక్రియనే ఇక్కడ అభిషేకం అన్నారు. ఆత్మ వివరించకపోతే వేదవాక్యం మన హృదయంలో ఏలాంటి ప్రభావమూ చూపలేదు. నేడు ఆత్మ మనకు క్రీస్తు బోధలను విప్పి చెప్తుంది. అతని వుపదేశాలను తలపనకు తెస్తుంది - యోహా 14,26. ఆత్మ వివరించి చెప్పకపోతే క్రీస్తు బోధలు మనకు అర్థం కావు. అతని జీవిత సంఘటనలు మనకు బోధపడవు. విశేషంగా అతని మరణిశోత్తానాలు భావాన్ని మనం గ్రహించలేం. ఆత్మడు మనలను సర్వసత్యంలోనికి నడిపించేవాడు -