పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రీస్తు సిలువపై శిరస్సువంచి ఆత్మను విడిచాడు - యోహా 19,30. క్రీస్తు మరణంనుండి ఆత్మ పట్టింది. ప్రేమతో గూడిన క్రీస్తు మరణంనుండి ప్రేమ నిధియైన ఆత్మ వెలువడింది. క్రీస్తు మరణమే ఆత్మకు మూలం. అతడు మహిమను పొందేంతవరకూ లోకంలో ఆత్మ లేదు - 7,37.

నీరూ నెతురూ క్రీస్తు హృదయంనుండి వెలువడ్డాయి. అవి అతని అంతరంగంనుండి స్రవించాయి. మన రక్షణం కొరకు నీరూ నెత్తురూ ఒలికించిన ప్రభువుని మనం లోకాంతం వరకు ధ్యానించుకోవాలి. "వారు తాము కత్తితో పొడిచిన వానివైపు చూస్తారు" అని ప్రవచించాడు జెకర్యా - 12,10.

క్రీస్తు ఆత్మను దయచేసేవాడు. అతడు మనకిచ్చే దానం ఆత్మ క్రీస్తు ఉత్తాన దేవరహస్యం ఆత్మకు జన్మస్థానం.

ప్రార్థనా భావాలు

1. యెరూషలేము సిరిల్ భక్తుడు ఈలా వ్రాసాడు. "పవిత్ర గ్రంథాలను వ్రాయించింది ఆత్మడే. అతడు ఆ పుస్తకాల్లో తన్ను గూర్చి తనకిష్టమొచ్చినంత మాత్రమే చెప్పించాడు. అతడు చెప్పించినదానికంటె మనం ఎక్కువ చెప్పకూడదు. ఐనా అతడు చెప్పించని విషయాలను గూర్చి మనం పరిశోధనం చేయవచ్చు." ఆత్మ పవిత్ర గ్రంథాల్లో తన్ను గూర్చి చాల స్వల్పంగా చెప్పించాడు గనుకనే ఆత్మను గూర్చిన దైవశాస్త్రం అంతగా వృద్ధిచెందలేదు. ప్రాచీనకాలం నుండి ఆత్మకు "గుప్తమైయున్న దేవుడు" అని పేరు. నేటికీ ఆత్మను గూర్చిన దేవరహస్యాలు ఎన్నో అస్పష్టంగానే మిగిలివున్నాయి.
2. సిరియా సీమోను అనే భక్తుడు ఈలా వాకొన్నాడు. "ఆత్మద్వారా మనం రోజూ ఉత్థానం పొందుతాం. ఇది లోకాంతంలో ప్రాప్తించే ఉత్థానం కాదు. ఈ లోకంలోనే పాపంనుండి పొందే ఉత్థానం. ఆత్మ రోజూ మనకు పాప పరిహారాన్ని దయచేస్తుంది. పాపంలో పడిపోయిన మనలను రోజూ పైకి లేపుతుంది." పాపపరిహారమనే యీ వత్థానాన్ని మనం అధికాధికంగా పొందాలని వేడుకొందాం.

13. క్రీస్తుకి సాక్ష్యంబలికే ఆత్మ

1. క్రీస్తు అద్బతాలద్వారా తండ్రి అతనికి సాక్ష్యం బలుకుతాడు - యోహా 8.18. పూర్వవేద గ్రంధాలు అతని తరపున సాక్ష్యం చెస్తాయి. స్నాపక యోహాను అతని పక్షాన సాక్ష్యం బలుకుతాడు - 1,6-7. కడన ఆత్మడుగూడ అతన్ని గూర్చి సాక్ష్యం బలుకుతాడు — 15,26.