పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12. ఆత్మను దయచేసే క్రీస్తు

1. ఉత్తాన క్రీస్తు మనకు ఆత్మను దయచేస్తాడు. క్రీస్తు ప్రాణదాతయైన ఆత్మ అయ్యాడు - అకొ 15,45. అతడు తాను సమృద్ధిగా స్వీకరించిన ఆత్మనే మనకుగూడ దయచేసాడు.

అతని అంతరంగంనుండి జీవజల నదులు ప్రవహిస్తాయి - యోహా 7,38. ఉత్థాన క్రీస్తునుండి పారే నీరు పవిత్రాత్మే. ఈ నీరు నరులను శుద్ధిచేస్తుంది. సఫలులను చేస్తుంది. మనకు జీవమిస్తుంది. పూర్వవేదంలో యెహెజ్కేలు దేవళంనుండి నీరు పారుతూందని చెప్పాడు - 47,1. ఆ దినాన యెరూషలేమునుండి స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తుందని జెకర్యావచించాడు - 14,8. కాని నూత్నవేదంలో క్రీస్తు తననుండే నీరు ప్రవహిస్తుందని వాకొన్నాడు. అతని ఆధిక్యం అలాంటిది.

2. క్రీస్తు తండ్రి దగ్గరికి వెళ్ళి అతని వద్దనుండి మనకు ఆత్మను పంపుతాడు - యోహా 16,7. ఈ వాక్యంలో తండ్రి దగ్గరికి వెళ్ళడమంటే మోక్షారోహణం చేయడమని అర్థం. క్రీస్తు స్వర్గంనుండి ఆత్మను పంపుతాడు. ఆత్మడు స్వర్గానికి చెందినవాడు. కనుక స్వర్గంనుండిగాని మనమీదికి దిగిరాడు. క్రీస్తు తండ్రి చెంతనుండి మనకు ఆత్మను పంపుతాడు - 15,26. క్రీస్తు తండ్రినుండి ఆత్మను పొంది తాను పొందిన ఆత్మను మనమీద కుమ్మరిస్తాడు - అ.చ. 2,33. ఆత్మను పంపడమనేది క్రీస్తు ఉత్థాన దేవరహస్యంలో ఓ ముఖ్యాంశం.

3. ఆత్మను పంపేది ఉత్తాన క్రీస్తు మాత్రమే. ఉత్థాన దేవరహస్యం ఆత్మకు జన్మస్థానం. క్రీస్తు ప్రక్కను బల్లెంతో తెరవగా నెత్తురూ నీరు స్రవించాయి, పూర్వం మోషే బెత్తంతో రాతి బండను కొట్టగా దానినుండి నీళ్ళు స్రవించాయి - సంఖ్యా 20,11. ఆ రాతిబండ క్రీస్తునే సూచిస్తుంది. ఆ రాయి క్రీస్తే - 1కొ 10,4.

క్రీస్తు ప్రక్కలోనుండి కారిన నెత్తురు అతడు బలిపశువని తెలియజేస్తుంది. కనుక ఈ నెత్తురు మన పాపాలకు పరిహారం చేస్తుంది. ఇంకా ఈ రక్తం దివ్యసత్రసాదానికి గూడా చిహ్నం. మనం ప్రభువు శరీరరక్తాలను భుజించి మన ఆకలిదప్పులు తీర్చుకొంటాం. అతన్ని స్వీకరించే వాళ్ళకు ఆకలి దప్పులు వుండవు - యోహా 6,35.

క్రీస్తు ప్రక్కలోనుండి కారిన నీరు వరప్రసాదానికీ జ్ఞానస్నాన జలాలకీ ఆత్మకీ చిహ్నం. ఉత్ధాన దేవరహస్యం ఆత్మకు జన్మస్థానమని ముందే చెప్పాం.

తెరువబడిన క్రీస్తు హృదయంనుండే శ్రీసభ పుట్టుకవచ్చింది. పూర్వం ఆదాము ప్రక్కలోనుండి ఏవ పట్టింది. అలాగే యిప్పడు క్రీస్తు ప్రక్కలోనుండి తిరుసభ పుట్టింది.