పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. న్యాయాన్ని పాటించడం ఏలా?

ఇంతవరకు న్యాయమంటే యేమిటో దాని అవసరమేమిటో చూచాం. ఇక దాన్ని ఏలా పాటించాలో పరిశీలిద్దాం. పైస్థానంలో వున్నవాళ్ళ న్యాయాన్ని నిశితంగా పాటించి క్రింది స్థానంలోనివాళ్ళకు మార్గదర్శకంగా వుండాలి. న్యాయవర్తనులు కానివాళ్ళు న్యాయమూర్తియైన దేవునికి ప్రియపడరు – ఎంత వున్నతమైన స్థానంలో వున్నవాళ్ళయినా సరే. న్యాయాన్ని గూర్చిన సూత్రాలు చాలా వున్నాయి. వాటినన్నిటినీ ఇక్కడ వివరించలేం. ముఖ్యమైన వాటిని కొన్నిటిని మాత్రం పరిశీలిద్దాం.

ఇతరుల హక్కులను మన్నించి వాళ్ళ సౌత్తును అపహరించకుండా వుండాలి. మళ్లా ఇక్కడ చాలా అంశాలున్నాయి.

1) పెద్దదిగాని చిన్నదిగాని దొంగతనం చేయకూడదు. తల్లిదండ్రులు పిల్లలకు చిన్నప్పటినుండే ఇతరుల సొత్తు నయాపైసకూడ ముట్టుకోగూడదని నిశితంగా బోధించాలి. వ్యాపారాలు చేసేవాళ్ళు చాల మోసాలు చేస్తుంటారు. విశేషంగా కొనుక్కొనే వాళ్ళల్లో అట్టే తెలివితేటలు లేకపోతే వాళ్ళను సులువుగా బోల్తాకొట్టిస్తారు, ఇది పెద్దదోషం. దొంగిలించిన సొమ్మకీ మోసగించిన సొమ్ముకీ నష్టపరిహారం చేయాలి.

2) మనం అనవసరంగా బాకీలు చేయకూడదు. చేసిన బాకీలు చిత్తశుద్ధితో తీర్చాలి. దేహశుద్ధికంటె ఆత్మశుద్ధి ముఖ్యం.

3) ఇతరులనుండి ఏదైనా పనిముట్టు అరువుతెచ్చుకొంటే దాన్ని అజాగ్రత్తగా వాడి చెడగొట్టకూడదు. దానిని సరైనస్థితిలో, సకాలంలో యజమానునికి ముట్టజెప్పాలి. చాలమంది తాము బదులుతీసికొన్న వస్తువును మళ్ళామళ్ళా అడిగించుకొనిగాని తిరిగి ఈయరు. ఇది నిక్కంగా దురభ్యాసం.

4) ఇతరుల వస్తువును మనం బుద్ధిపూర్వకంగా చెడగొడితే తప్పక నష్టపరిహారం చేయాలి. మనకు దొరికిన వస్తువును మనం దక్కించుకోగూడదు. దానిని సొంతదారునికి ముట్టజెప్పాలి.

వస్తువులేకాదు మంచిపేరుకూడ నరులకు సాత్తులాంటిది. కనుక మనం ఆ మంచిపేరును చెడగొట్టకూడదు. ఇక్కడకూడ చాల విషయాలున్నాయి. 1) మనం చాలసారులు వెలుపలి పనులను మాత్రమే చూచి ఇతరులను చెడ్డవాళ్ళనుగా ఎంచుతాం. కాని వాళ్ళ హృదయంలోని ఉద్దేశాలు మనకు తెలియవు. వాళ్ళ హృదయంలో మంచి వుద్దేశం వుంటే వాళ్ళ చేసేపని చెడ్డది కాదు. అది మన దృష్టిలో చెద్దదైనా దేవుని దృష్టిలో మంచిదే ఔతుంది. కనుక మనం ఇతరులను గూర్చి సులభంగా దురభిప్రాయాలు కలిగించుకోగూడదు. తోడివారి మాటలకూ చేతలకూ సాధ్యమైనంతవరకు మంచి అర్ధాన్ని కల్పించాలేగాని చెడుఅర్ధాన్ని కల్పించగూడదు. నరుల మంచిచెడ్డలు ఎంచడానికి న్యాయాధిపతియైన దేవుడున్నాడు. మనం ఆ పనికి పూనుకోవడం సాహసమే ఔతుంది.