పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దైవవార్తతో జోడింపబడి దివ్యత్వాన్ని పొందింది. కనుక అతని మానుష దేహం ఆరాధ్యవస్తుమోతుంది. క్రీస్తు హృదయం కూడ అతని మానుష దేహంలో భాగం. కనుక అదికూడ ఆరాధ్యవస్తువెతుంది. రెండవది, క్రీస్తు హృదయం అతనికి నరజాతిపట్లగల ప్రేమకు చిహ్నంగా వుంటుంది. ఏ సంస్కృతిలోనైనా హృదయం ప్రేమకు చిహ్నమేగదా? క్రీస్తు గుండెకూడ అచ్చంగా మన గుండెలాంటిదే. ఇంకా నరుని హృదయం అతని భౌతిక, నైతిక, ఆధ్యాత్మిక జీవితానికి చిహ్నంగా వుంటుంది. అతని జీవితానికంతటికీ కేంద్రంగా వుంటుంది. ప్రధానంగా అది నరుని వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. మన హృదయమంటే మన వ్యక్తిత్వం. అలాగే క్రీస్తు హృదయంకూడ అతని ప్రేమపూరితమైన వ్యక్తిత్వానికీ, రక్షణాత్మకమైన వ్యక్తిత్వానికీ ప్రతీకగా వుంటుంది. ఈలా క్రీస్తు ప్రేమకీ వ్యక్తిత్వానికీ చిహ్నమైన అతని భౌతిక హృదయాన్ని ఆరాధిస్తాం.

క్రీస్తు హృదయం అతని ప్రేమకు చిహ్నంగా వుంటుందని చెప్పాం. అతని ప్రేమ దైవప్రేమ, మానుషప్రేమ అని రెండు రకాలుగా వుంటుంది. మొదట అతని దైవప్రేమను తిలకిద్దాం. త్రీత్వంలోని ముగ్గురు దివ్యవ్యక్తులూ మనలను గాఢంగా ప్రేమించి మన రక్షణానికి పూనుకొన్నారు. ఆ దివ్యవ్యక్తుల ప్రేమ నరావతారమెత్తిన క్రీస్తు మానుష హృదయంలోకి ప్రవేశించి అతడు గాధానురాగంతో మన కొరకు ఆత్మార్పణం చేసికొనేలా చేసింది. కనుక క్రీస్తు దైవప్రేమను మనం ఆరాధిస్తాం. అటుతరువాత అతని మానుష ప్రేమను పరిశీలిద్దాం. క్రీస్తు మనలాగే అచ్చంగా నరుడు. నరుబ్లాగే అతడు మనలను ప్రేమించాడు. మనలను అంతం వరకు ప్రేమించాడు - యోహా 18, 1. అనగా తన జీవితాంతం వరకూ, తాను ప్రేమించగలిగినంతవరకూ గూడ మనలను ప్రేమించాడు. కనుక అతని మానుష ప్రేమనుగూడ మనం ఆరాధిస్తాం. ఈలా క్రీస్తు హృదయం అతని దైవమానుష ప్రేమలు రెండింటికీ గుర్తుగా వుంటుంది. మనం ఆ రెండు ప్రేమలను పూజిస్తాం.

3. బదులు ప్రేమ

మీ దేవుడైన ప్రభువుని పూర్ణహృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణశక్తితో ప్రేమించండి అన్నది మోషే ధర్మశాస్త్ర కాలంనుండీ వస్తూన్న ఆజ్ఞ - ద్వితీ 6,5. దేవుని ప్రేమ క్రీస్తులోను అతని హృదయంలోను మనకు ప్రత్యక్షమౌతుంది. కనుక పౌలులాగ మనంకూడ “అతడు నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణత్యాగం చేసాడు" అని చెప్పాలి - గల 2,20.