పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/151

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

క్రీస్తు మన ప్రధాన యాజకుడు అనే భావం ధ్వనిస్తుంది. ఇంకా ఏకవస్త్రం ఐక్యతకు చిహ్నం, క్రీస్తు శిష్యుల్లో ఈ యేక వస్త్రంలో లాగే ఐక్యత వుండాలని భావం.

క్రీస్తు సిలువ విూద ఫనోర వ్యధలు అనుభవిస్తుంటే క్రింద సైనికులు ఏమి పట్టనట్లుగా చీట్ల వేసికొంటున్నారు. ఈనాడు మనం మాత్రం లోకవిషయాల్లో మునిగిపోయి ప్రభువుని పట్టించుకోకుండా వుండిపోవడం లేదా? ఆ సైనికుల కంటె మనం ఏమి యెరుగు?

క్రీస్తు తండ్రి చిత్తానికి లొంగి సర్వస్వం, చివరికి కట్టబట్టలను గూడ, వదులుకొన్నాడు. మనకు ప్రీతికరమైన వస్తువులను త్యాగం జేస్తేనే గాని ప్రభువుని సంపాదించుకోలేం.

సైనికులు ద్రోహబుద్ధితో క్రీస్తు వస్తాలు అపహరించారు. కాని సిలువ చెంత నిల్చి వున్నపుణ్యస్త్రీలు ప్రియశిష్యుడు అలాంటివాళ్లు కాదు. ఇక వాళ్ల చరిత్రను పరిశీలిద్దాం.

3. క్రీస్తు తల్లి, ప్రియశిష్యుడు - 19,25–27

తొలిమూడు సువిశేషాల్లో క్రీస్తు సిలువ విూద వ్రేలాడుతుండగా పుణ్యస్త్రీలు దూరంగా నిలబడి చూస్తుంటారు. క్రీస్తు చనిపోయిన తర్వాతనేగాని వాళ్లు క్రీస్తువైపు చూడరు. కాని యోహాను సువిశేషంలో పుణ్యస్త్రీలు క్రీస్తు సిలువకు దగ్గరగా సిలువ చెంతనే వుంటారు, క్రీస్తు చనిపోకముందే క్రీస్తువైపు చూస్తుంటారు.

క్రీస్తు చనిపోకముందు విధవ అనాథయైన తల్లిని ప్రియ శిష్యుడైన యోహాను అండదండల్లో వుంచాడు. మరియను యోహానుకి తల్లిగా అర్పించాడు. యోహానుని గూడ ఆమెకు కుమారునిగా సమర్పించాడు. ఇది సువిశేషం చదవగానే మనకు తట్టే భావం, కాని ఈ ఘట్టంలో ఇంకా యెంతో లోతైన భావాలు దాగి వున్నాయి.

సిలువ క్రింద నిలబడి వున్న మరియ తిరుసభకు గుర్తుగా వుంటుంది. మొదటి యేవను కూడ జ్ఞప్తికి తెస్తుంది. యోహాను క్రీస్తుని విశ్వసించే శిష్యులందరికీ గుర్తుగా వుంటాడు. క్రీస్తు బోధలను విశ్వసించిన మరియ క్రీస్తు మరణానంతరం ఆధ్యాత్మికంగా బిడ్డలను కంటుంది. ఈ బిడ్డలు క్రీస్తు శిష్యులే. యోహానూ అతనిచుట్టు ప్రోగైయున్న భక్త సమాజము మరియ ఆధ్యాత్మికంగా కన్నబిడ్డలే. యోహానులో శిష్యులమైన మనమందరం ఇమిడివున్నాం, కనుక ఆధ్యాత్మికంగా యోహానూ భక్తసమాజమూ మనమందరమూ కూడ మరియకు బిడ్డలమే. కనుక ఆ తల్లిపట్ల మనకు అపారమైన భక్తి వండాలి. యోహానులాగే మనం కూడ క్రీస్తుకి నిజమైన సాక్షులంగా వుండాలి.