పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాని దీనికిముందు మనం ఇంకో అంశం పరిశీలించాలి. ఈ యంశం మత్తయి గ్రంథంలో మాత్రమే వస్తుంది. పిలాతు క్రీస్తుకి తీర్పు తీరుస్తుండగా అతని భార్య అతనికొక కబురు పంపింది. "నేడు (గురువారం) కలలో ఆ యేసుని గూర్చి చాల బాధపడ్డాను. నీవు ఆ నీతిమంతుని గూర్చి ఎలాంటి జోక్యం కలిగించుకోవద్దు" అని చెప్పించింది - 27,19, ఈ సందేశం దేవుని నుండే వచ్చింది. మత్తయి సువిశేషంలో దేవుడు యోసేపు మొదలైన భక్తులతో చాలసార్లు కలల్లో మాటలాడుతుంటాడు. (1,20. 2,12, 13. 19, 32) అందువల్ల ఈమెకు కలలో కన్పించిన సందేశం దేవుని సందేశం అనుకోవాలి. ఇంకా ఈమె క్రీస్తుని "నీతిమంతుడు" అని పేర్కొంది. అలాంటి నీతిమంతుని విడుదల చేయడం పిలాతు బాధ్యత, కాని అతడా పని చేయలేకపోయాడు. ఇక్కడ ఓ అన్యజాతి మహిళ క్రీస్తుని నీతిమంతునిగా గుర్తించింది. కాని స్వజాతివాళ్ళయిన యూదులు మాత్రం అతన్ని అలా గుర్తించలేకపోయారు.

పిలాతు విూకు యేసు కావాలా లేక బరబ్బా కావాలా అని జనుల గుంపుని అడిగాడు అన్నాం గదా! ప్రధానార్చకులు బరబ్బానే విడిపించమని అడగండని ప్రజల గుంపుని ఎగద్రోసారు. భార్య కబురు పంపిన తర్వాత పిలాతు అదే ప్రశ్నను మరల రెండవసారి అడిగాడు. వెంటనే ప్రజాసమూహం బరబ్భానే విడిపించమని కోరింది. ఈ జనులంతా పూర్వం క్రీస్తుకి సుముఖులే. వాళ్లలో క్రీస్తు బోధలు విన్నవాళ్ళూ అతని అద్భుతాల వల్ల లాభం పొందినవాళ్ళూ వున్నారు. ఐనా ఇప్పడు తమ దుష్టనాయకుల మాట విని వీళ్ళంతా క్రీస్తుకి విరోధులయ్యారు.

పిలాతు కోర్కె నెరవేరలేదు కనుక కలతజెందాడు. బరబ్బాను విడిపించ మంటున్నారు. మరి క్రీస్తుని ఏమిచేయమంటారని అతడు ప్రజల నడిగాడు. అతన్ని సిలువ వేయించమని జనులు జవాబు చెప్పారు. రాళ్ళతో కొట్టి చంపడం యూదుల మరణశిక్ష సిలువ వేయడం రోమనుల మరణశిక్ష ఇది చాల బాధతో కూడన శిక్ష గొప్ప నేరగాళ్ళకు విధించే శిక్ష కనుక క్రీస్తు ఏమి గొప్పనేరం చేసాడని అతన్ని సిలువ వేయమంటారని పిలాతు మల్లీ అడిగాడు. ప్రజలు అతన్ని సిలువ వేయించు అని బిగ్గరగా అరచి గల్లంతు చేసారు.

పిలాతు ప్రజల ముందు తాను నిస్సహాయణ్ణనీ, ఏమి చేయజాలననీ గుర్తించాడు. ప్రజలు విప్లవం లేవదీస్తారని భయపడ్డాడు. క్రీస్తుకి న్యాయం జరగవలసిందే. కాని యెరూషలేములో శాంతిని నెలకొల్పడం అతని పూచీ, లేకపోతే రోము అతన్ని శిక్షిస్తుంది. కనుక అతడు న్యాయాన్ని వదలివేసి పట్టణంలో శాంతిని స్థాపించడానికి పూనుకొన్నాడు. క్రీస్తుని సిలువ మరణానికి అప్పగించడానికి సంసిద్దుడయ్యాడు. 112