పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మరణించిన తర్వాత అతడు మళ్లా ఉత్థానమౌతాడు. కనుక ఈ వాక్యం క్రీస్తు ఉత్థానాన్ని పేర్కొంటుంది. అతడు ఉత్థానానంతరం గలిలయకు వెళ్లాడు. పూర్వం అక్కడనే ప్రభువు శిష్యులను ప్రోగుజేసికొన్నాడు. అక్కడనే అతడు చాల అద్భుతాలు బోధలు చేసాడు. కనుక అక్కడనే వారిని మల్లా కలసికొంటారు, శిష్యులు క్రీస్తుని విడచి పారిపోయి పాపం కట్టుకొంటారు. కాని ఉత్థాన క్రీస్తు గలిలయలో వారి పాపాన్ని మన్నిస్తాడు. వారిని తిరిగి తనతో రాజీపరచుకొంటాడు. లోకమంతట తన్ను గూర్చి బోధించమని అక్కడనే వారికి తుది ఆజ్ఞనిస్తాడు. ఇక్కడ క్రీస్తుకి శిష్యులపట్ల గల దయనూ సానుభూతినీ చక్కగా అర్థం చేసికోవాలి. వాళ్లు అతన్ని నిరాకరించినా అతడు వాళ్ళను నిరాకరించడు. వాళ్లు అతనికి ద్రోహం చేసినా అతడు ఆ ద్రోహాన్ని పట్టించుకోకుండా వాళ్లను మల్లా తనకు మిత్రులను చేసికొంటాడు.

మీరు నా కారణంగా పడిపోతారు. నన్ను విడనాడి వెళ్లిపోతారు అని ప్రభువు ముందుగానే శిష్యులతో చెప్పాడు. కాని పేత్రు ప్రభువుతో వీళ్లంతా నిన్ను విడనాడినా నేను మాత్రం నిన్ను విడనాడనని బింకాలు పల్కాడు. కాని పేత్రు తన మాట నిలబెట్టుకోలేదు. ప్రభువు పేత్రూ! నీవా నన్ను విడనాడకుండా వుండేది! ఈ రాత్రే, కోడికూయకముందే, నీవు నన్నుమూడుసార్లు నిరాకరిస్తావు సుమా అని హెచ్చరించాడు. పేత్రు రోషం తెచ్చుకొని నేను నీతో చనిపోవలసివచ్చినా నిన్నునిరాకరించను అని గొప్పలు చెప్పకొన్నాడు. ఇతర శిష్యులు కూడ అతనిలాగే డాబుసరి మాటలు పల్కారు.

కాని శత్రువులు క్రీస్తుని బంధించడం జూచి పేత్రు భయపడిపోయాడు. కనుక అతడు ప్రభూ నేనే నిన్ను వదలనే వదలనని ఎంత గట్టిగా చెప్పాడో అంత గట్టిగానే నేనతన్నియెరుగనే యెరుగనని మూడుసార్లు బొంకాడు. అతనికి తొందరపాటు ఎక్కువ. తనమిద తనకు ఉండకూడనంత నమ్మకం వుంది, తన బలహీనత తనకే తెలియదు. ఈ యతి నమ్మకం పేత్రునిలాగే మనలను కూడ నాశం చేయవచ్చు. ఉత్తముడు తన్ను తాను నమ్మాలి. కాని తన బలహీనతను తలంచుకొని భయపడాలి కూడ. స్వల్ప విషయం లోనే మనమంతా కూలిపోతాం. అతి తేలికగా పాపం కట్టుకొంటాం.

3. గెత్సెమని - 26, 36-56

ఈ భాగంలో రెండంశాలున్నాయి. మత్తయి మొదట క్రీస్తు చేసిన ప్రార్థనను వర్ణించాడు - 26,36-46. అటుపిమ్మట శత్రువులు క్రీస్తుని బంధించిన తీరును వివరించాడు - 26,47-56. ఈ రెండంశాలను క్రమంగా పరిశీలిద్దాం.