పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నడచిపోవాలి. ఈ బాధలు శారీరకమైనవికావచ్చు, మానసికమైనవి కావచ్చు.మరేమైనా కావచ్చు. 3. శిష్యుడు ప్రభువువెంట బోవాలి. అనగా ప్రభువు జీవితవిధానాన్ని అనుసరించాలి. అతని జీవితవిధానంలో రెండుఘట్టాలు ముఖ్యమైనవి - మరణమూ, ఉత్తానమూ, శిష్యుడు ఈ రెండిటినీ అనుసరించాలి. రబ్బయిలు శిష్యులు తమ గురువులనుండి కొన్ని బోధలు విన్నారు. తరువాత తామూ రబ్బయిలై తాము విన్న బోధలను మల్లా తమ శిష్యులకు అందించారు. కాని క్రీస్తు శిష్యులు అతని బోధలను నేర్చుకొని వాటిని శిష్యపరంపరకు అందీయలేదు. మరి అతని జీవితవిధానాన్ని అనుకరించారు. తామూ అతనిలా జీవించడం మొదలెట్టారు. తమ్ముతాము పూర్తిగా ఆ ప్రభువుకి అర్పించుకొన్నారు. ఈనాడు మనంకూడ కేవలం ఆప్రభువు బోధలను ఆలిస్తే చాలదు. అతని జీవితపద్ధతిని విశేషంగా అతని మరణిత్తానాలను - మన జీవితంలో ప్రతిబింబించుకోగలిగి వుండాలి. క్రీస్తు సిలువకు దడిసి ఆ ప్రభువుని నిరాకరించేవాళ్ళని అతడు కూడ నిరాకరిస్తాడు - మత్త 10-32. పైన ప్రభువులాగే శిష్యుడుకూడ తన సిలువను తాను మోసికొనిపోవాలనీ, ఈ సిలువ బాధలకు చిహ్నమనీ చెప్పాం. కాని శిష్యులు క్రీస్తు సిలువను ఎంతవరకు అర్థంచేసికొన్నారు? ప్రభువు తాను యెరూషలేము వెళ్ళి హింసలనుభవించి సిలువమీద మరణిస్తానని ముందుగానే చెప్పాడు, కాని శిష్యులకు అతని బోధలు అర్థంకాలేదు. పైగా పేత్రు నీవేమిటి సిలువ మరణం అనుభవించడమేమిటి అని ప్రభువుని మందలించాడు. అనగా అతనికి సిలువభావం ఏమాత్రం బోధపడలేదు- మత్త 16, 21-23. కనుకనే క్రీస్తుని బంధించినపుడు శిష్యులంతా బ్రతుకుజీవుడా అని పారిపోయారు - మత్త26,56. అయితే ఆత్మ దిగివచ్చాక శిష్యులకు క్రీస్తు బాధాతత్వం అర్థమయింది. అతడు ఎందుకు చనిపోయాడో, చనిపోయి ఏమి సాధించాడో తెలిసికొన్నారు. అటుపిమ్మట వాళ్ళు ప్రభువు కోసం బాధలనుభవించడం మహాభాగ్యమని యెంచారు - అచ 5, 40-41. మనంగూడ ఇంచుమించు ఈయపోస్తలుల్లాగే వుంటాం. మొదట్లో ఆ ప్రభువు బాధాతత్వాన్ని అర్థంచేసికోం. మన జీవితంలో వచ్చేసిలువలను కూడ సహించం. కాని క్రీస్తు అనుభవానికి వచ్చేకొద్దీ ఆ గురువు సిలువే మన భుజాలమీదికి గూడ ఎక్కిందని గుర్తిస్తాం. మొదట క్రీస్తు బాధల్లో పాలుపంచుకొని తర్వాత అతనివైభవంలోగూడ భాగస్తులమౌతామని గ్రహిస్తాం - రోమా 8,17. ఆ ప్రభువు కొరకు బాధలు అనుభవించినవాళ్ళు కడన ఆప్రభువులాగే సింహాసనాన్ని అధిష్టిస్తారని అర్థం చేసికొంటాం - మత్త 19,28. ఏమైతేనేం, సిలువతత్వం అర్థంజేసికోనివాడు ప్రభువు శిష్యుడు కాలేడు.