పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరిచారకుడు. క్రీస్తు శిష్యులుకూడ అందరికీ సేవలుచేయడం నేర్చుకోవాలి - మత్త 2,11. లోకంలో అధికారులు తమ క్రిందివాళ్ళమీద పెత్తనం చలాయిస్తారు. కాని క్రీస్తు శిష్యులు ఆలా చేయకూడదు. మనుష్యకుమారునిలాగ తామూ పరిచారం చేయాలేగాని, చేయించుకోగూడదు - మార్కు 10, 42-45. కనుక క్రీస్తు శిష్యులకు వినయంతో సేవలు చేయడం తగుతుంది కాని పెత్తనం చేయడం తగదు.

7. క్రీస్తుతోపాటు, బాధలూ, మరణమూ

శిష్యుల బాధ్యత క్రీస్తు బోధలను నేర్చుకోవడం గాదు, అతని జీవితవిధానాన్ని అనుసరించడం అని చెప్పాం. కాని క్రీస్తు జీవితవిధానం ఏమిటి? అతనిది సిలువమార్గం, సిలువమరణం. కనుక శిష్యుడికిగూడ ఈ సిలువమార్గం తప్పదు. అందుకే ప్రభువు "ఎవడైనా నన్ను వెంబడింపగోరితే తన్నుతాను త్యజించుకొని తన సిలువ నెత్తుకొని నావెంటరావాలి" అన్నాడు - మత్త 16,24. మరోతావులో యేసు "శిష్యుడు గురువుకంటె అధికుడు కాదు. తాను కూడ గురువులాగే వండాలి” అని చెప్పాడు - మత్త 10, 2425. ఈ వాక్యాలనుబట్టి గురువుకి ఒక మార్గమూ, శిష్యుడికి ఇంకోమార్గమూ అంటూలేదు. పై మత్తయి 16,24వ వచనంలో మూడు భావాలున్నాయి. 1) శిష్యుడు తన్నుతాను త్యజించుకోవాలి. 2) తన సిలువను తాను ఎత్తుకోవాలి. 3) ప్రభువు వెంటపోవాలి. ఈ మూడు భావాలను క్రమంగా పరిశీలిద్దాం. 1. శిష్యుడు తన్నుతాను త్యజించుకోవాలి. మామూలుగా నరుడు నాకు నేనే రాజుని అన్నట్లు స్వేచ్చగా వర్తించబోతాడు. తానాడింది ఆట పాడింది పాట. అతనిలో విపరీతమైన స్వార్ధంగూడ వుంటుంది. కనుక ఇతరులను తన ప్రయోజనానికి వాడుకోబోతాడు. కాని క్రీస్తు శిష్యుడు కాగోరేవాడు ఈ స్వార్ణాన్నీ ఈ సొంత అధికారాన్నీ వదలుకోవాలి. తన చిత్తప్రకారం తాను జీవించడం అనే పద్ధతిని విడనాడాలి. అతడు తన హృదయ సింహాసనంమీద తానే ఆసీనుడు కాకూడదు. ఆ యాసనాన్ని క్రీస్తుకి ఇచ్చివేయాలి. ఇక మీదట తన యిష్టం వచ్చినట్లుగా తాను నడవకూడదు, క్రీస్తుచేత నడిపింపబడాలి. 2. తన సిలువను తాను మోసికోవాలి. క్రీస్తు తన సిలువను తాను మోసికొని వెళ్లాడు. సిలువ బాధకు చిహ్నం. ఆ గురువుకి చాల బాధలు ఎదురయ్యాయి. యూదనాయకులు అతన్ని ఎదిరించారు, అతనిమీద దౌర్జన్యం చూపారు. అతన్ని అవమాన పరచారు, బాధించారు, హింసించారు, చంపారు. క్రీస్తుకి ప్రాప్తించిన ఈ కష్టాలన్నీ ఏదో రూపంలో శిష్యుడికి కూడ ప్రాప్తిస్తాయి. ఆగురువులాగే శిష్యుడుకూడ బాధామార్గంలో