పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చెప్పారు - లూకా 22,35. ప్రభువు శిష్యులను ప్రేషిత సేవకు పంపినపుడు వారికి అన్ని వస్తువులు ఇచ్చి పంపలేదు. ఐనా వారికి ఏ కొరత రాలేదు. ఎందుకు? తండ్రి ఆ సేవాకాలంలో వారి అక్కరలన్నీ తీర్చాడు కనుక, అందుకే మనం తండ్రిని నమ్మి జీవించాలి.

తండ్రి మనకు క్రీస్తుని రక్షకుణ్ణిగా ఇచ్చాడు. ఆ రక్షకుని ద్వారానే మనకు సర్వస్వమూ దయచేసాడు అనుకోవాలి. తండ్రిగా బిడ్డలమైన మనలను పట్టించుకోవడం అతని పూచీ. ఈ బాధ్యతను అతడు ఏనాడు విస్మరించడు. క్రీస్తు అంతటివాణ్ణి మన కొరకు దయచేసాక మనలను ఏలా విస్మరిస్తాడు? మన తరఫున మనం అనవసరంగా ఆందోళనం చెంది బాధను కొనితెచ్చుకొటాం. కాని ఈ యాందోళనం వలన మన ఆయుస్సును ఏమాత్రం పెంచుకోలేం - మత్త 6,27.

2. అల్ప విషయల్లో కూడ

మామూలుగా మనం దేవుడు స్వల్ప విషయాలను పట్టించుకోడు అనుకొంటాం. కాని ఇది పొరపాటు. దేవుడు మన తలవెండ్రుకలను గూడ లెక్కబెట్టుకొని వుంటాడు - మత్త 10,30. కనుక అతని అనుమతి లేనిదే మన తలవెండ్రుక ఒక్కటి వూడిపడదు. తల రోమంకంటె అల్ప వస్తువు ఏముంది? అలాంటి స్వల్పవస్తువుని గూర్చి కూడ అతడు జాగ్రత్తపడతాడు. అతని అనుమతి లేనిదే పెద్ద సంఘటనంగాని చిన్న సంఘటనంగాని ఏది జరగదు. నరుడు తన తలలోని రోమం ఒకటి ఊడినందుకుగాని ఊడనందుకుగాని పెద్దగా విచారించడు. కాని దేవుడు విచారిస్తాడు. మనపట్ల అతడు అంత జాగ్రత్తతో, అంత కరుణతో మెలుగుతాడు.

యూదుల దృష్టిలో పిచ్చుక అల్పప్రాణి. ఆ రోజుల్లో ఒక దమ్మిడీకి రెండు పిచ్చుకలు వచ్చేవి. ఆలాంటి చిన్నప్రాణి కూడ దేవుని అనుమతి లేనిదే చావదు. పిచ్చుకలనుగూడ పట్టించుకొనే దేవుడు వాటికంటె ఎన్నోరెట్ల అధికులైన నరులను పట్టించుకోడా? క్రీస్తుకి అనుచరులూ, అతనిద్వారా తనకు స్వయంగా దత్తపుత్రులు ఐన నరులను పట్టించుకోడా? తప్పకుండా పట్టించుకొంటాడు - మత్త 11,29-31. కనుక పెద్ద విషయాల్లోగాని స్వల్ప విషయాల్లోగాని మనకు ఆందోళనం పనికిరాదు. ఇంకా మనం అనుకొన్నట్లుగా అదృష్టం దురదృష్టం అనేవి ఏవీలేవు. అన్ని వస్తువులు, అన్ని సంఘటనలు దేవుని అధీనంలో వుంటాయి. దేవుని అనుగ్రహం లేనిదే చెట్టమీది ఆకుకూడ కదలాడదు.

3. ప్రకృతిని కూడ

దేవుడు ఒక్క నరులనే గాక ప్రకృతిలోని పక్షులనూ చెట్టుచేమలనూగూడ పట్టించుకొంటాడు. కాకులు వున్నాయి కదా! అవి పైరులువేసి పంటలు పండించి ధాన్యాన్ని