పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బోధించారు. అలాగే క్రీస్తు క్రొత్తయిస్రాయేలయిన నూత్నవేద ప్రజలను పేత్రు అనేరాతిమీద నిర్మించాడు. ఇదే ప్రవక్తలు పేర్కొనిన మెస్సీయా సమాజం, శేషసమాజం, క్రైస్తవసమాజం.

58. ఈ సమాజమనే భవనాన్ని క్రీస్తు నిర్మించాడన్నాం. ఈ భవనానికి పునాది అపోస్తలులు. అపోస్తలులు బోధించిన బోధల వలన ప్రజలు ఈ సమాజంలో చేరతారు. వాళ్లబోధలు ఈ సమాజానికి పునాదిలాంటివి– ఎఫె 2.20, కాని ఈ భవనానికి పునాది రాయిమాత్రం నిత్యం క్రీస్తే - 1కొ3, 11. క్రీస్తుతో పాటే ఈభవన నిర్మాణంలో అపోస్తలులు గూడ తోడ్పడ్డారు. అందుకే పౌలు "మేము దేవునికి తోడి పనివాళ్లము. మీరు ఆ దేవుని పొలంగా, గృహంగా పరిగణింప బడతారు" అంటాడు- 1 కొ 3,9. తొలినాటి క్రైస్తవ సమాజాలను నిర్మించడానికి పౌలు ఎంతకృషి చేసాడో అతని 14 జాబులు చదివిన వాళ్ళకు బోధపడుతుంది. ఈ కృషినే అతడు దేవునితో కలసి పనిచేయడంగా భావించాడు.

59. ఇక క్రీస్తు అపోస్తలులు మాత్రమే తిరుసభ అనే భవనాన్ని నిర్మిస్తే చాలదు. ఎవరికి వాళ్లే ఈ భవనాన్ని నిర్మించుకుంటూ పోవాలి. అందుకే పేత్రు “మీరుకూడ సజీవశిలల్లాగ ఆధ్యాత్మిక మందిరములోనికి నిర్మింపబడండి" అంటాడు- 1 పేత్రు 2,5 యెరూషలేములో ఓ రాతి దేవాలయముందిగదా! దానితో పోల్చిచూచినటైతే క్రైస్తవ సమాజం శిలామందిరం కాదు. ఆధ్యాత్మిక మందిరం. మనం ఈ మందిరములోని సజీవ శిలలం. అనగా వ్యక్తిగతంగా బుద్ధిపూర్వకంగా క్రీస్తుని విశ్వసించాలి, చైతన్యంతో ఈ సమాజంలో పనిచేయాలి. పైగా మనంతటమనమే స్వయంగా ఈ క్రైస్తవ సమాజమనే మందిరంలోనికి నిర్మింపబడాలి.

60. క్రీస్తు నూత్నవేద సమాజమనే భవనాన్ని నిర్మించాడన్నాం. సోదరప్రేమ ఈ భవన నీర్మాణానికి తోడ్పడుతుంది. అంచేత మనం తోడి ప్రజను ప్రేమిస్తూ ఆదరిస్తూండాలి -1కొ 8,1. అపోస్తలులు బోధించిన సత్యాలు ఈ భవనాభివృద్ధికి తోడ్పడతాయి. కనుక మనం ఈ సత్యాలను చక్కగా నేర్చుకొని ఇతరులకు బోధిసూండాలి - కొలో 2,6-7. ప్రార్ధనం ఈ భవన నిర్మాణానికి తోడ్పడుతుంది. అంచేత మనం మనకొరకూ ఇతరుల కొరకూ ప్రార్ధిస్తూండాలి - యూదా 20. మనల్ని మనం ఈ భవనంలోనికి నిర్మించుకొనడం మాత్రమేగాదు, ఇరుగుపొరుగువాళ్లనుగూడ ఈ భవనం లోనికి నిర్మించడం మన బాధ్యత - రోమ 15,2. కడన, ఈ క్రైస్తవ సమాజమనే భవనం దేవునికి వాసస్థలమని గుర్తించాలి. అనగా ఆ ప్రభువు దేవాలయంలో నెలకొని వున్నట్లుగా ఈ సమాజంలో నెలకొనివుంటాడు. అందుకే పౌలు "ఆ క్రీస్తునందు మీరుకూడ ఇతరులతోపాటు ఓ ఆలయంగా కట్టబడుతూన్నారు. దేవుడు తన ఆత్మతో ఈ యాలయంలో వసిస్తాడు" అని వ్రాసాడుఎఫె 2,22 అంచేత మనం ఈ సమాజాన్ని గౌరవంతో చూస్తుండాలి. ఈ సమాజప్రజల్లో దేవుని, అతని క్రీస్తును, అతని ఆత్మను గుర్తిస్తూండాలి.