పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. ప్రభువు యిస్రాయేలును ఓ జాతిగా తీర్చిదిద్దాడు. వారికి కనాను దేశాన్నిచ్చాడు. వారిని ఈజిప్టు దాస్యం నుండి విడిపించాడు. వారి చెంతకు ప్రవక్తలనూ, తన కుమారుని గూడ పంపాడు. ఐనా వాళ్ళు దేవుని మాట వినలేదు. అతడు నూత్న వేదంలో మనలను జ్ఞానస్నానం ద్వారా తన ప్రజలను చేసికొన్నాడు. మనకు వ్యక్తిగతమైన లాభాలు, విజయాలు దయచేసాడు. కాని మనం దేవుని మాట వింటున్నామా? దైవ ప్రేమను సోదర ప్రేమను పాటిస్తున్నామా? నేను అనే ద్రాక్షతోట దేవునికి మంచి ఫలాలనిస్తుందా?

4. ఈ కథలోని కౌలుదార్లు తోటను తమ సొంతం జేసికోవాలనుకొన్నారు. అది వారి స్వార్ధం మనం దేవునికి సేవ చేసినట్లే నటించి మన స్వార్ణ లాభాన్ని చూచుకోవడం లేదా? మనకు దైవ సేవలో కూడ మన పేరు, మన లాభం, మన ప్రాముఖ్యం, మన కీర్తి ముఖ్యం కాదా? మనం దేవుని సొమ్మను మన స్వప్రయోజనానికి వాడుకోవడం లేదా?

5. ఈ కథలోని ద్రాక్షతోట దైవరాజ్యం, యూదులు తగిన ఫలాన్ని ఈయకపోతే దేవుడు దాన్ని క్రైస్తవులకు ఇచ్చాడు. ఒకడు దేవుని వరప్రసాదాన్ని నిరాకరిస్తే మరొకడు దాన్నిస్వీకరిస్తాడు. నామట్టుకు నేను దేవుని వరప్రసాదాన్నీ ఆహ్వానాన్నీ అంగీకరిస్తున్నానా లేక నిరాకరిస్తున్నానా?

6. ఈ కథలోని యజమానుడు వాళ్ళు నా కుమారుని గౌరవిస్తారు అనుకొని పుత్రుడ్డి పంపాడు. ఈ పత్రుడు క్రీస్తే, అతడు కడన విజయాన్ని సాధిస్తాడు. తండ్రి అతన్ని సమస్తానికి వారసుని చేసాడు - హెబ్రే 1,2. ఇప్పడు నేను ఆ క్రీస్తుని నా సర్వస్వంగా భావిస్తున్నానా?

13. వివాహ విందు 22,1–14

1. క్రీస్తు ఈ సామెతను చెప్పినపుడు అతని భావం ఇది. ఆహ్వానింపబడిన గొప్ప అతిథులు విందును నిరాకరించారు, వారికి బదులుగా సామాన్యులను విందుకు పిలిచారు. ఈలాగే యూదనాయకులకు బదులుగా సుంకరులు, పాపులు దైవ రాజ్యంలో భాగస్టులౌతారు.

ఇక మత్తయి ఈ సామెతను లిఖించినపుడు అతని భావం ఇది. విందుకు రాని గొప్ప అతిథులకు బదులుగా సామాన్యులు విందులో పాల్గొన్నారు. వీరిలో విందు వస్త్రం లేనివాణ్ణి గెంటివేసారు. అలాగే యూదులు నిరాకరించిన దైవరాజ్యం అన్యజాతి వారికి • - అనగా క్రైస్తవులకు దక్కుతుంది. కాని వీరిలో పుణ్యక్రియలు లేనివారిని రాజ్యం నుండి గెంటివేస్తారు.