పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తండ్రి ప్రజలకు తీర్పు తీర్చబోతున్నాడు. కనుక యూదులు వెంటనే పరివర్తనం చెంది మెస్సియాను అంగీకరించాలి. లేకపోతే దేవుడు కఠినశిక్ష విధిస్తాడు - ఈలాంటి భావాలతో క్రీస్తు మొదట యూదులకు ఈ సామెతలు విన్పించాడు. ప్రభువు ఉత్థానానంతరం ఓ పాతిక యేండ్ల తర్వాత సువిశేష కారులు ఈ సామెతలను సువార్తల్లో లిఖించారు. ఈ గ్రంథాలు విశేషంగా క్రైస్తవుల కోసం. కనుక ఈ సామెతలను గూడ క్రైస్తవులకు అన్వయించేలాగ మార్చవలసి వచ్చింది. అప్పటి క్రైస్తవుల నమ్మిక, ప్రభువు వెంటనే రెండవమారు విజయం చేస్తాడని. అందుచేత సువిశేషకారులు ఈ వర్గం సామెతలన్నిటినీ ప్రభువు రెండవ రాకడకు వేచివుండాలి అనే భావం వచ్చేలాగ మార్చివేసారు.

ఈ మార్పు కేవలం సువిశేషకారులు చేసింది కాదు. పరిశుద్ధాత్మచే ప్రబోధితమై ఆనాటి క్రైస్తవ సమాజమే ఈ మార్పు చేసింది. సువిశేషకారులు ఈ సమాజానికి ప్రతినిధులు మాత్రమే. ఇక ఈ వర్గం సామెతలను పరిశీలిద్దాం.

1. అకస్మాత్తుగా వచ్చే దొంగ - మత్త 24, 43-44

1. వివరణం

దొంగ ఎప్పడు వచ్చేది తెలిస్తే ఇంటి యజమానుడు నిద్రించడు, మేల్కొని ఉంటాడు. కాని దొంగ మనం ఏమరచి ఉన్నప్పడు వస్తాడు. అలాగే మెస్సియా కూడ తలవని తలంపుగా రెండవమారు విజయం చేస్తాడు. కనుక భక్తులు ఏమరుపాటు లేక అతని కోసం వేచివుండాలి.

2. అన్వయం

దర్శన గ్రంథం 3, 3లో ప్రభువు "నేను దొంగలాగ వస్తాను. నేను ఎప్పడు వచ్చేది విూరు ఊహించనైనా ఊహించలేరు" అంటాడు. కనుక మన మెప్పడూ నిర్మల హృదయంతో ప్రభువు రాకడకు సిద్ధమై యుండాలి.

2. మేల్కొనివుండే సేవకులు – లూకా 12, 35-88

ఒక యజమానుడు బయటికి వెళ్ళి పొదుపోయాక ఆలస్యంగా తిరిగి వచ్చాడు. అతడు వచ్చేవరకు సేవకులు నిద్రపోకుండా జాగ్రత్తగా కాచుకొని ఉన్నారు. వీళ్ళ విశ్వాసాన్ని చూచి యజమానుడు ఎంతో సంతోషించాడు. తానే ఒక పరిచారకుళ్లాగా వాళ్ళకు వద్దెన చేసాడు. ఈ సేవకుల్లాగే మనం కూడ ప్రభువు కోసం వేచివుండాలని భావం. ఇదే సామెత కొలది మార్పులతో మార్కు 13, 33-37లో కూడ కన్పిస్తుంది.