పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముందుగా ఈ యాజ్ఞను విూరుతూంటాం. దీన్నిబట్టే మన క్రైస్తవ జీవితం ఎంత నిస్సారమైందో ఊహించుకోవచ్చు కనుక ఈ రంగంలో మనమందరమూ ఆత్మ సంస్కరణకు పూనుకోవలసి ఉంటుంది.

9. ఉపమాన వాక్యాలు

శిష్య లక్షణాలను గూర్చి కొన్ని ఉపమాన వాక్యాలు గూడ ఉన్నాయి. ఈ వాక్యాలు సామెతల్లాగ విస్తృతి చెందకుండా సంగ్రహంగా ఉండిపోయాయి. ఐనా ఇవి కూడ చిన్న చిన్న సామెతలే. ప్రభువు ఆకాశంలోని పక్షులను పోషించేవాడు. అవి పైరు వేయవూ, ధాన్యం చేకూర్చుకోవు. ఐనా పరలోక పిత వాటిని పోషిస్తూన్నాడు. అలాగే గడ్డి మొక్కలు కూడాను. అవి నూలు వడికి వస్తాలు నేసికోవు. ఐనా ప్రభువు వాటికి రంగురంగుల బట్టలిచ్చాడు. ఆ వస్తాలు సోలోమోను తాల్చిన విలువగల బట్టలకంటె అందంగా ఉంటాయి. అవే వాటి పూలు. కాని ప్రభువు ఈ పక్షుల కంటె, ఈ గడ్డి మొక్కల కంటె నరులను ఇంకా అధికంగా ఆదరిస్తాడు గదా! కనుక శిష్యులు అతన్ని నమ్మడం నేర్చుకోవాలి - 6, 26-30.

కన్ను దేహానికి దీపం. కనుకనే శరీరానికి నయనం ప్రధానం. ఈ కంటికి చూపు బాగా ఉంటే దేహమంతా వెలుగులో ఉన్నట్లుగా ఉంటుంది. లేకపోతే చీకటిలో ఉన్నట్లుగా ఉంటుంది. ఇక, దేహానికి మంచి దృష్టిగల నేత్రం ఏలాగో, మన జీవితానికి గూడ భగవంతుని విూదనే మనసు నిలుపుకోవడం అలాంటిది. శిష్యులు ఏకమనస్ములై ఆ ప్రభువునే సేవించాలి గాని ఇహలోక వస్తువుల విూద హృదయం లగ్నం చేసికోగూడదు — మత్త 6,22-23.

భోజనానికి రుచిని ఇచ్చేది ఉప్ప. కనుక భోజనానికి ప్రధానమైంది లవణం. ఇక అన్నానికి ఉప్ప ఏలాగో లోకానికి శిష్యులూ అలాగు. వాళ్లు తమ సత్కార్యాల ద్వారా ప్రపంచానికి దేవుణ్ణి గూర్చి సాక్ష్యమిస్తారు. అందుకే వాళ్ళ మంచి పనులను జూచి లోకంలోని జనం దేవుణ్ణి కొనియాడతారు అని చెప్పబడింది. ఇంకా దీపస్తంభం విూద వెలిగే దీపమూ పర్వతం విూద కట్టబడి అందరికీ కన్పించే నగరమూ కూడ శిష్యులకు ఉపమానంగా ఉంటాయి. అనగా వాళ్లు ప్రముఖులుగా ఉంటారనీ, వాళ్ళ మంచి పనులు ఓ వెలుగులా ప్రకాశిస్తాయనీ భావం - మత్త 5, 14-16.

శిష్యులు ఇద్దరు యజమానులను సేవింపగూడదు. ఆ యిద్దరూ దేవుడూ, డబ్బును. క్రైస్తవ నాయకులు ఈ నియమాన్ని విూరడం వల్ల కలుగుతున్న అనర్ధకాలు రోజురోజు చూస్తూనే ఉన్నాం - మత్త 6,24. ఈలాంటిదే ధనవంతుడు దైవరాజ్యాన్ని చేరుకోవడం కంటె ఒంటె సూది బెజ్జంలో దూరడం సులభం అనే సామెత - మార్కు 10, 25. శిష్యులు ధనానికి గాక, దేవునికి దైవరాజ్యానికి దాసులు కావాలి అని ఈ సామెత భావం.