పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అప్పను మన్నించలేకపోయాడు మరి! అందుచేత రాజు అతణ్ణి తలారులకు అప్పగించాడు. వీళ్ళ ఆ రోజులలో చెరసాల అధికారులు, మహా క్రూరులు. మామూలు జనానికి వాళ్ళను చూస్తేనే మొచ్చెమటలు పోసేవి. కనుక ఆ సేవకుడు వాళ్ళ చేతుల్లో దారుణబాధలు అనుభవించి వుండాలి. ఆ సేవకుడెటూ అంత అప్పను తీర్చుకోలేడు. కనుక అతనికి విధింపబడిన దారుణ శిక్షకు గూడ ముగింపు లేదు. అనగా అతడు జీవితాంతం బాధలనుభవిస్తూ చివరకు ఆ చెరలోనే చనిపోయి వండాలి.

ఈ సామెత చివరి వచనంలో పొరుగువాళ్ళని హృదయపూర్వకంగా క్షమించాలని చెప్పబడింది. కొందరు పైకి మాత్రం శత్రువుని క్షమించినట్లే నటిస్తూ లోలోపల అతనిమిూద పగదీర్చుకోవడానికి సమయం వెదుకుతూంటారు. ఈలాంటి మనస్తత్వం ఈ సామెత బోధకు వ్యతిరేకమైంది.

సామెత భావం యిది. ఈ సామెత లోని రాజులాగే భగవంతుడు కరుణామయుడు. మనం తనకు జేసిన అపరాధాలన్నీ ఆ ప్రభువు నెనరుతో క్షమిస్తూంటాడు. కాని ఆ ప్రభువులాగే మన తరపున మనం గూడ తోడి జనుల అపరాధాలను క్షమిస్తూండాలి. ఎందుకంటే దయామయుడైన ఆ భగవంతుని బిడ్డలం గనుక, మనం గూడ ఆ తండ్రి లాగే ప్రవర్తించాలి. ఆ ప్రభువు కారుణ్యమే కనుక మన జీవితంలో కన్పించకపోతే మనం అతని బిడ్డలంగాము. అతడు మనలను కఠినంగా శిక్షిస్తాడు గూడ.

3. అన్వయం

1) భగవంతునిలో వుందీ నరునిలో లేందీ దయాగుణం అని చెప్పాం. ఆ ప్రభువు దయగలవాడు. నరుడు ఆ దయామయుడైన భగవంతునికి పోలికగా సృజించబడ్డాడు. కనుక మనం గూడ దయాగుణం ప్రదర్శించాలి. తోడి జనులను క్షమిసూండాలి. అందుకే సువిశేషం "ఇతరుల తప్పలను మీరు క్షమిస్తే పరంలోకంలోని మిూ తండ్రి విూ తప్పలను క్షమిస్తాడు. పరుల తప్పలను విూరు క్షమించకపోతే మిూ తండ్రి మిూ తప్పలను క్షమించడు" అని చెప్తుంది - మత్త 6, 14-15.

2) ఒకోమారు ఇతరులను క్షమించాలంటే మన అభిమానము కోపతాపాలు అడ్డువస్తాయి. అటువంటప్పుడు క్షమించాలని కోరుకొన్నా క్షమించలేం. ఐనా భగవంతుడు అనుగ్రహించినట్లయితే ఈలాంటి కష్టమైన క్షమాపణలు గూడ సులభమౌతాయి. ఆ ప్రభు వరప్రసాదం మన హృదయంలోని పగద్వేషం మొదలైన అనిష్టగుణాలను కడిగివేస్తుంది. ప్రభు వరప్రసాదమంటే పరిశుద్దాత్మ గూడ. ఈ యాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లోనికి కుమ్మరింపబడుతుంది - రోమా 5,5. ఈ ప్రేమ శక్తితో మనం శత్రువులను క్షమించగలం. కావున భక్తుడు ఈ వరప్రసాదబలం కోసం భగవంతుణ్ణి ప్రార్ధించాలి. శత్రుక్షమాపణ మనేది క్రైస్తవ జీవితానికి అత్యవసరం. అది లేందే క్రీస్తు శిష్యులం కాలేం.