పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దళితోద్యమం మన దేశంలో పూర్వం బుద్దునితోనే ప్రారంభమైంది. అతడు బ్రాహ్మణవర్గాన్ని ఎదిరించి బడుగువర్గాన్ని ఆదుకొన్నాడు. ఆపిమ్మట అది మధ్యయుగాల్లోని భక్తి ఉద్యమంలో పొడచూపింది. ఈ వుద్యమం పామరులకు కూడ ముక్తి లభిస్తుందని చాటి చెప్పింది. మన కాలంలో అది అంబేద్కరు ఉద్యమంలో మళ్లా తలయెత్తింది. బుధుని విప్లవభావాలు క్రీస్తులో ఫలసిద్ధినందాయి.

క్రీస్తు నవసమాజ భావాలు 300 యేండ్లపాటు ప్రజలను తీక్షణంగా ప్రభావితం చేసాయి. కాని మూడవ శతాబ్దంలో కోన్స్టంటయిను చక్రవర్తి క్రైస్తవుడు కావడంతో క్రీస్తు విప్లవ భావాలు వాటి తీక్షణతను కొంతవరకు కోల్పోయాయి. కాని శతాబ్దాల పొడుగున అవి పేదసాదలను ప్రభావితం చేస్తూనేవచ్చాయి. ఆధునిక కాలంలో లక్షలకొలది దళితులు క్రీస్తు ప్రేమ తత్వానికీ స్వార్ణ త్యాగానికీ మురిసిపోయి అతని శిష్యులయ్యారు. ఇది బ్రాహ్మణ హిందూమతానికి ఎదురు నిల్చే ఉద్యమం. ఇది భవిష్యత్తులో కూడ కొనసాగుతుంది.

కులవాదం భారతీయులను బందీలను చేసింది. కులం చెరసాల కొంతవరకు కూలిపోయినా ఇంకా నిల్చేవుంది. చాలమంది క్రైస్తవులు కూడా దానిలో బందీలైయున్నారు. ఈ కులం కోటను నేడు మనం పూర్తిగా కూల్చివేయాలి. క్రీస్తు ప్రారంభించిన దళితోద్యమాన్ని మనం కొనసాగించుకొని పోవాలి. దళితుల హక్కులను నిలబెట్టాలి. అందరూ క్రీస్తు ఉద్యమానికి చేయూతనిచ్చి నవసమాజ స్థాపనకు కంకణం కట్టుకోవాలి.