పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. యోహాను మరణం

20-23 వచనాలు యోహాను మరణాన్ని తెలియజేస్తాయి. క్రీస్తు ముందు పోతున్నాడు. పేత్రు అతని వెంట వెళ్తున్నాడు. వారి వెంట యోహాను వస్తున్నాడు. పేత్రు వెనుకకు తిరిగి యోహానుని చూచాడు. యోహాను కూడ శిష్యుడే. ఐనా అతడు పేత్రుకంటె భిన్నంగా ప్రవర్తించాడు. క్రీస్తుని సిలువవేసేపుడు పేత్రు పారిపోయాడు. కాని యోహాను పారిపోలేదు. ఆదివారం ఉదయం అతడు కూడ పేత్రుతోపాటు సమాధి దగ్గరికి వచ్చాడు. కనుక పేత్రుకి ఇతని అంత్యగతి యేలా వుంటుందో తెలిసికొందామనే కుతూహలం కలిగింది. కనుక అతని గతిని గూర్చి క్రీస్తుని ప్రశ్నించాడు.

ప్రభువు పేత్రుతో నీ విషయం నీవుచూచుకో. అతని సంగతి నీకెందుకు అన్నాడు22. భగవంతుడు ఎవరికి నిర్ణయించే గతిని వారికి నిర్ణయిస్తాడు. ఒకరి భవిష్యత్తుతో మరొకరికి పనిలేదు. ఎవరి భవిష్యత్తుని వాళ్ళ పట్టించుకొంటేచాలు. దేవుడు దయగలవాడు కనుక అందరి భవిష్యత్తుని తానే పట్టించుకొంటాడు.

పేత్రు వేదసాక్షి మరణం ద్వారా క్రీస్తుకి సాక్ష్యం పలికాడు. యోహాను మామూలు మరణం ద్వారా ప్రభువుకి సాక్ష్యం పలికాడు. ఎవరి పద్ధతిలో వాళ్ళు ఈ యిద్దరూ గొప్పవాళ్లే. కనుక వారిలో ఎవడు గొప్పవాడు అనే ప్రశ్న రాకూడదు. బహుశ తొలినాటి క్రైస్తవుల్లో పేత్రు యోహానుల్లో ఎవడు అధికుడు అనే ప్రశ్న తలెత్తి వుంటుంది. యోహాను శిష్యులు మా గురువు కూడ పేత్రు అంతటివాడు అని వాదించి వుంటారు. ఈ బైబులు వాక్యాలు ఆనాటి శిష్యుల వివాదాలను సూచిస్తాయి.

ప్రభువు యోహానుని గూర్చి "నేను వచ్చేవరకు అతడు ఈలాగే వుండడం నాకిష్టం" అన్నాడు-22. ఈ వాక్యానికి యోహాను లోకాంతందాకా చనిపోకుండా వుండిపోతాడని భావంకాదు. పేత్రూ! యోహాను విషయం నీకనవసరం. నీపని నీవు చూచుకో అని మాత్రమే ఈ వాక్యానికి అర్థం. అందరు నరుల్లాగే యోహాను కూడ సామాన్య మరణానికి గురయ్యాడు అనుకోవాలి.

చివరి సంపాదకుడు ఈ 21వ అధ్యాయాన్ని వ్రాసేటప్పటికే "యేసు ప్రేమించిన శిష్యుడు", చనిపోయాడు. అతడు లోకాంతం వరకు చనిపోడని అతని అనుచరులు భావిస్తుండేవాళ్ళు. కనుక అతని అకాలమరణం వారికి నిరాశను పుట్టించింది. ఐతే ఆ అనుచరులు క్రీస్తు వాక్యాన్ని తప్పగా అర్థంచేసికొన్నారనీ, ఈ శిష్యుడు లోకాంతందాకా బ్రతికి వుంటాడని క్రీస్తు అసలు చెప్పనేలేదనీ ఈ చివరి సంపాదకుడు తెలియజేస్తున్నాడు.