పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పేత్రు యోహానులు తిరిగిపోయాక మరియ భక్తిభావంతో సమాధి దగ్గరే వుండిపోయింది. ఆమెకు మొదట దేవదూతలూ తర్వాత క్రీస్తూ కన్పించారు. కాని ఆమె క్రీస్తుని గుర్తుపట్టలేకపోయింది. అతడు తోటమాలి యేమో అనుకొంది. ఎందుకు? క్రీస్తు పూర్వపు క్రీస్తే అయినా వృత్తానం తర్వాత అతనిరూపం మారింది-1 కొ 15,42-44 కడకు మరియ క్రీస్తు స్వరం విని అతన్ని గుర్తుపట్టింది, ప్రభువు ఆమెను "మరియా" అని పిల్చాడు - 16. పూర్వం యేసు చాలసార్లు ఆమెను ఆలాగే ఆప్యాయంగా పేరెత్తి పిల్చివుంటాడు. ఆ అనుభవం వల్లనే ఆమె యిప్పడు క్రీస్తు స్వరంలో అతన్ని గుర్తుపట్ట కలిగింది. భక్తులకు భగవంతునిపట్ల గాధానుభవం వుంటుంది. ఆ అనుభవం తమ జీవితంలోని కొన్ని సంఘటనలను పురస్కరించుకొని గూడ వుంటుంది. ఈ పట్టున ఇంకో విషయాన్నిగూడ గమనించాలి. మరియ తోటమాలితో నీవు క్రీస్తుదేహాన్నిచూపిస్తే నేనుదాన్ని ఎత్తుకొనిపోతాను అంది—15. ఓ ఆడకూతురు మృతదేహాన్ని మోసికొని పోవడమా? ప్రేమ భారాన్ని లెక్కజేయదు కదా! మగ్డలీన భక్తిభావంతో ప్రభువు పాదాలకు పెనవేసి కొంది. ఆ యడుగులను దీర్ఘకాలం గట్టిగా పట్టుకొని ఉండిపోవాలి అనుకొంది. కనుక ప్రభువు ఆమెతో నీవు నన్ను పట్టుకొని వుండిపోవద్దు అన్నాడు – 17. ఇక్కడ భావం ఇది. క్రీస్తు ఇక్కడ తాత్కాలికంగా మరియకు దర్శనమిచ్చాడు. మరియు ఈ తాత్కాలికమైన దివ్యసాన్నిధ్యాన్ని భద్రంగా నిలబెట్టుకోవాలనుకొంది. కనుకనే అతని పాదాలను వదలలేదు. కాని ఆత్మ దిగివచ్చాక క్రీస్తుశిష్యులకు తన శాశ్వత సాన్నిధ్యాన్ని దయచేస్తాడు. పవిత్రాత్మ ద్వారా అతడు శిష్యులకు నిరంతరం ప్రత్యక్షమై వుంటాడు, ప్రభువు మరియను ఈ రెండవ సాన్నిధ్యానికి సిద్ధంజేయగోరాడు. కనుక ఆమెతో "ఇక నన్ను వదలు. నేను నా తండ్రి దగ్గరికి ఆరోహణం చేయాలి. ఆ యారోహణం ద్వారానే ఆత్మను మీ మీదికి పంపాలి. ఆ యాత్మ సహాయంతో నేను శాశ్వతంగా మీతో నెలకొని వుండాలి. నీవు శిష్యుల వద్దకు పోయి వారికి ఈ సంగతిని తెలియజేయి" అని చెప్పాడు. ఇక్కడ శిష్యులు క్రీస్తుకి సోదరులు. యావే ప్రభువు వారందరికి తండ్రి, దేవుడు, అనగా క్రీస్తు శిష్యులను తనతో కలుపుకొన్నాడేగాని తననుండి వేరుచేయలేదు. వాళ్ళంటే అతనికి అంత ప్రేమ. ఎమ్మావు శిష్యులకథలో శిష్యులు రొట్టె విరుస్తుండగా క్రీస్తుని గుర్తుపట్టారు. ఇక్కడ మరియు క్రీస్తు వాక్యంలో (పిలుపులో) అతన్ని గుర్తుపట్టింది. దివ్య సత్రసాదమూ బైబులు వాక్యమూ రెండూ మనం క్రీస్తుని కలసికొనే ప్రధాన సాధనాలు. మరియ క్రీస్తు తన్ను పేరెత్తి పిలవడంతో అతన్ని గుర్తించింది అన్నాం - 16. ఇది గొప్ప భక్తి భావం. ప్రభువు తన గొర్రెలను (భక్తులను) పేరుపేరున పిలుస్తాడు - 107