పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వారా దేవునితో ప్రేమతోను చనువతోను సంభాషించాలి. అతడు మనకు తన బిడ్డలమయ్యే భాగ్యాన్ని దయచేసాడు. కనుక బిడ్డలమైన మన మడిగింది నేడు తప్పక దయచేస్తాడు.

మా యొక్క తండ్రి

"మా యొక్క తండ్రి" అన్న పదాల ద్వారా మనకు దేవునిపట్ల చనువు వుందని సూచిస్తాం. పూర్వవేద ప్రవక్తలు ఆ తండ్రి ప్రేమను మనకు తెలియజేసారు. ఆ ప్రేమ యిప్పడు క్రీస్తు మరణోత్తానాల ద్వారా పూర్తిగా నెరవేరింది. అలాంటి ప్రేమగల తండ్రి యిప్పడు మనకు దేవుడు ఔతాడు, మనం అతని ప్రజలమౌతాయి. ఈ నూత్న సంబంధం మనకు క్రీస్తు ద్వారా లభించింది. కృపాసత్యాలు ఆ ప్రభువునుండే వస్తాయి కదా! యోహా 1,17.

మనం మా యొక్క తండ్రీ అనిపిల్చే వ్యక్తీ అచ్చమైన పరమత్రీత్వం. కుమారుడు అతనినుండి శాశ్వతంగా జనిస్తాడు. ఆత్మడు అతనినుండి నిరంతరాయంగా బయలుదేరుతాడు. ఐనా ఆ వ్యక్తి ఒకే దేవుడు. మనకు ఆత్మద్వారా క్రీస్తునందు తండ్రితో ఐక్యత చేకూరింది. మనం ఆ దైవ వ్యక్తులను విడదీయక ఐక్యభావంతోనే ఆరాధిస్తాం.

“మాయొక్క తండ్రీ" అన్నపుడు ఆ తండ్రి క్రీస్తుని విశ్వసించి అతనిలోనికి జ్ఞానస్నానం పొందిన వాళ్ళందరికీ తండ్రి ఔతాడు. అనగా అతడు క్యాతలిక్, ప్రోటస్టెంటు సమాజాలకు గూడ తండ్రి. వీళ్ళంతా క్రీస్తులోనికి జ్ఞానస్నానంపొంది ఆత్మనుండి జనించిన వాళ్ళే యెరూషలేములోని ఉమ్మడి సమాజం ఒకే మనస్సుతోను ఒకే హృదయంతోను జీవించింది - అ,చ, 4,32. ఆ సమాజ జీవితం నేడు మనకు కూడ ఆదర్శం కావాలి. ఈ పరలోకజపం క్రైస్తవ శాఖలన్నీ కలసిపోయి పరస్పర ప్రేమతో జీవించాలని హెచ్చరిస్తుంది. తన శిష్యులంతా ఒకే మంద కావాలని ప్రభువు కోరాడు కదా! - యోహా 10,16.

కాని పరమపిత ఒక్క క్రైస్తవులకేకాక లోకంలోని నరులందరికీ తండ్రి. మన భారతదేశంలోనే నానా మతాలవాళ్ళు నానా జాతులవాళ్ళ వసిస్తున్నారు. ఆ దివ్యజనకుడు హిందువులకు, బౌద్దులకు, సిక్కులకు గూడ తండ్రి. కనుక మన విద్యాసంస్థల్లో ఆస్పత్రుల్లో సాంఘిక సేవా కార్యక్రమాల్లో అన్యమతస్తులను కేటాయించకూడదు. నరులంతా దేవుని బిడ్డలే.

మనలో బోలెడంత వ్యక్తిత్వవాదం వుంటుంది. అనగా నేను, నా శ్రేయస్సు ముఖ్యమనుకొంటాం. తోడివారిని పట్టించుకోం. క్రైస్తవుడు ఈ వ్యక్తిత్వవాదాన్ని వదలుకొని తోడివారితో కలసిపోవాలని గూడ మా యొక్క తండ్రీ అనే మాటలు సూచిస్తాయి.