పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

5. దేవునిమీద కోరిక

ప్రార్థనాభ్యాసం కలగాలంటే దేవునిమీద గాఢమైన కోర్కె వుండాలి. ఈ కోర్కెను ప్రభువే పుట్టిస్తాడు. దీని ద్వారా మనం ప్రభువుపట్ల ఆకర్షితులమౌతాం.

ఆకలివేసి తిన్న అన్నం రుచిగా వుంటుంది. బాగా అరిగి దేహానికి పుష్టినిస్తుంది. ఈలాగే మనకు దేవునిమీద ఆకలివేయాలి. ఈ యాకలి కల్గినవాడు దేవుణ్ణి వెదకుతాడు. అతనికొరకు తపించిపోతాడు. అతనికి ప్రార్ధనం చేస్తాడు.

మూమూలుగా మనం లౌకిక వస్తువుల్లో పడి దేవునిమీద ఆకలి కలిగించుకోవడం మర్చిపోతాం. దేవుణ్ణి మర్చిపోయినవాళ్లు జపాన్ని గూడ మర్చిపోతారు.

ఒడ్డున బడవేసిన చేప నీటికొరకు తపిస్తుంది. ఆలాగే భక్తుడు భగవంతుని కొరకు తపించాలి. అగస్టీను భక్తుడు "ప్రభూ! మా హృదయాన్ని నీ కొరకే చేసావు. నీయందు విశ్రమించిందాకా దానికి విశ్రాంతిలేదు" అని వాకొన్నాడు. నరుడు విశ్రాంతిలేని హృదయంతో, తీరని దాహంతో దేవుని కొరకు గాలించాలి.

రామకృష్ణ పరమహంస ఈ వుపమానం చెప్పాడు. దొంగ ఓ గదిలో పండుకొని నిద్రపోబోతున్నాడు. దాని ప్రక్కగదిలో బంగారముంది. ఆ గదికీ దొంగవున్న గదికీ మధ్య ఓ పల్చని గోడ మాత్రమే అడ్డముంది. ఈ పరిస్థితుల్లో ఆ దొంగ నిద్రిస్తాడా? రాత్రంతా మేల్కొనివుండి ఆ పల్చని గోడను పగలగొట్టి ఆ బంగారాన్ని దోచుకొని పోవడానికి యత్నించడా? ఆలాగే మనంకూడ దేవుడనే బంగారాన్ని సంపాదించుకోవడానికి నిరంతరం యత్నించాలి.

ప్రభువే మనకు తనమీద కోర్కెను దయచేస్తాడు. మన తరపున మనం ఈ వరంకోసం అతన్ని మాటిమాటికి అడుగుకోవాలి. ఓసారి ఈ కోర్కె పడితే ప్రార్ధనం సుకరమౌతుంది.