పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అతడు ప్రభువు ఆదేశంపై గళమెత్తి
ఆ శల్యాలు పూర్వనరరూపం దాల్చాలని ప్రవచించాడు
తత్ క్షణమే ఆ యస్థులు ఒకదానికొకటి సంధించుకొని
మాంసం పొదుగుకొని చర్మం కప్పకొని
నిండు దేహాలయ్యాయి పూర్వమానవాకృతితో
ఐనా వాటిల్లో యింకా జీవమంటూ లేదు
ప్రవక్త ప్రభువు ఆజ్ఞపై మళ్లా గొంతెత్తి
జీవాత్మ ఆ శరీరాల్లోనికి ప్రవేశించాలని ప్రవచించాడు
వెంటనే ఆ కళేబరాలు చైతన్యంపొంది జీవం తెచ్చుకొని
లేచి నిల్చున్నాయి పూర్వపు మహాసైన్యంగా
అప్పడు దేవుడు ప్రవక్తతో "ఈ యెముకలగూళ్ళూ
బాబిలోను ప్రవాసంలో చిక్కిన యిస్రాయేలీయులకు గుర్తు
వాళ్లు నిరుత్సాహంతో తమ బ్రతుకులు ఎండిపోయాయనీ
తమ యాశలు మోడువారిపోయాయనీ విలపిస్తున్నారు
కనుక నీవు నా పేరుమిదిగా వాళ్ళను
హెచ్చరించి ప్రోత్సహించు
వాళ్ళు సమాధుల్లో శిధిలమైపోయిన శల్యాల్లా వున్నారు
ఐనా నేనా సమాధులు తెరచి వాళ్ళను బయటికి రప్పిస్తాను
నా యాత్మను వాళ్ళమీద కుమ్మరించి
వాళ్ళకు జీవం ప్రసాదిస్తాను
మళ్లా వాళ్ళు స్వీయదేశం చేరుకొనేలా చేస్తాను" అన్నాడు
క్రీస్తుప్రభూ! నీ కృపవల్ల ఈ ప్రవచనం
నేడు మాపట్లగూడ నెరవేరుతుంది
ఉత్థాన పురుషుడవైన నీవు
నీ యాత్మను నేడు మా మీద కుమ్మరిస్తావు
ఆ దివ్యాత్మ మా నిరుత్సాహాన్ని తొలగిస్తుంది
మమ్ము ఓదార్చి చైతన్యవంతులను చేస్తుంది
అనారోగ్యమూ ఆటంకాలూ అపజయాలూ శోధనలూ
మొదలైన నానాయాతనలవల్ల మేము బెండువడిపోతే
నీ యాత్మ మాకు ఉల్లాసమూ ఉత్తేజమూ ప్రసాదిస్తుంది
మా జన్మభూమియైన స్వర్గసీమకు మమ్ము నడిపిస్తుంది
ఉత్థాన నాయకుడవైన ప్రభూ! నీకివే మా నమస్కారాలు.