పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పూర్వం తండ్రి ఆరురోజులు సృష్టిచేసి ఏడవ దినాన విశ్రమించాడు - ఆది 2,7. ఆలాగే క్రీస్తుకూడ రక్షణనుగూర్చి తాను చేయవలసిన కృషి అంతా చేసాడు. అతడు ప్రవక్తగా ప్రజలకు దేవుని సందేశం విన్పించాడు. రాజుగా, నాయకుడుగా ప్రజలను నడిపించాడు. యాజకుడుగా సిలువమీద ప్రాణాలర్పించాడు. ఇక అతడు విశ్రాంతిని పొందుతాడు. మోక్షానికివెళ్ళి తండ్రి కుడి పార్వాస ఆసీనుడౌతాడు. ఇక రెండవ రక్షకుడంటూ లేదు. రెండవ రక్షణ మార్గంకూడ లేదు. అతని పేరుమీదిగా తప్పితే మరో పేరుమీదిగా భూమిమీది మానవులకు రక్షణం కలుగదు - అచ 4, 12.

క్రీస్తుని గూర్చిన ప్రవచనాలన్నీ నెరవేరాయి అని చెప్పాం. మెస్సీయా గాడిదనెక్కి వినయంతో యెరూషలేము ప్రవేశిస్తాడన్నాడు జెకరయా. అదే ప్రవక్త అతన్ని నలుబది వెండి కాసులకు అమ్ముతారనీ ఆ డబ్బుతోనే రక్తక్షేత్రం అనే పొలాన్ని కొంటారనీ చెప్పాడు. యెషయా ప్రవక్త మెస్సీయాను క్రూరంగా హింసించి చంపుతారనీ అలా చనిపోతూ అతడు శత్రువులకొరకు మనవి చేస్తాడనీ నుడివాడు. అతనిచే పులిసినరసం త్రాగిస్తారనీ విరోధులు అతని దుస్తులను పంచుకొంటారనీ కీర్తనకారులు ప్రవచించారు. ఆతని యింటివాడే, అనగా అతని శిష్యుడే, అతన్ని మోసగించి మరణంపాలు చేస్తాడనిగూడ చెప్పాడు. ఇంకా పూర్వవేదం ఆ మెస్సియా మోషేలాంటి ప్రవక్త అనీ, మెల్మీసెడెక్కలాంటి యాజకుడనీ, హేబెలులాంటి నిర్దోషి అనీ, ఈసాకులాగ బలి అయ్యేవాడనీ చెప్తుంది. పైపెచ్చు పూర్వవేదంలో బలియిచ్చిన పొట్టేళ్లు, కోడెలూ, గువ్వలూ, పాపాలు మోసికొనిపోయిన మేకలూ మొదలైన బలిపశువులన్నీ అతన్నే సూచిస్తాయి, ఈ ప్రవచనాలూ, ఈ సూచక వ్యక్తులూ, ఈ బలిపశువులూ అన్నీ క్రీస్తునందు సార్ధక్యం పొందాయి. కనుకనే అంతా సమాప్తమైంది, అంతా నెరవేరింది అని చెప్పి తలవంచి ప్రాణం విడిచాడు ప్రభువు.

క్రీస్తు పర్వతంమీద బోధించిన ప్రసంగం అద్భుతమైంది. ఐనా ఆ ప్రసంగం ముగిసాక అతడు “అంతా సమాప్తమైంది" అనలేదు. అతడు వచ్చింది ప్రధానంగా బోధించడానికికాదు. అనేకుల కొరకు తన ప్రాణాన్ని బలిపెట్టడానికి, యెరూషలేము వెళూ అతడు మనుష్యకుమారుణ్ణి అన్యజాతివారికి అప్పగిస్తారని పల్మాడు. వాళ్ళ అతన్ని అపహసించి, చండ్రకోలలతో మోది చంపివేస్తారన్నాడు, గెత్సెమని తోపులో తన్ను పట్టుకోవడానికి నచ్చిన శత్రువులమీదికి పేత్రు కత్తి యెత్తగా, తండ్రి తనకిచ్చిన పాత్రను తాను త్రాగితీరాలి అన్నాడు. అతడు పండ్రెండవ యేట తప్పిపోయి మళ్ళా తల్లిదండ్రులకు దొరికినపుడు నేను నా తండ్రి పనుల్లో నిమగ్నుజ్జయి వండాలి అన్నాడు. ఇంకా, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే నాకాహారం అనికూడ అన్నాడు. ఈలా క్రీస్తు తన సిలువ మరణాన్ని గూర్చి ముందుగా ఎరిగించిన సంగతులన్నీ అక్షరాల నెరవేరాయి.