పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లొంగిపోతాం. కాని క్రీస్తుకి తన మరణం మీద సర్వాధికారమూ వుంది. దానికి అతడు లొంగిపోలేదు. తన కిష్టమొచ్చినపుడు, తనక్టిమొచ్చిన రీతిలో దాన్ని ఆహ్వానించాడు. కనుకనే ప్రవచనాలన్నీ నెరవేరి, తాను వచ్చినపని ముగిసినపిదపనేగాని అతడు మృత్యువుని అంగీకరింపలేదు. అనగా దానికి అతనిమీద కాదు, అతనికి దానిమీద అధికారం వుంది. ఎవరూ నా ప్రాణాలను తీయలేరు. నాయంతట నేనే ప్రాణాలను ధారపోస్తాను. నేను నా ప్రాణాలను మళ్ళా పొందుతానుకూడ" అన్నాడు ప్రభువు - యోహా 10,18.

క్రీస్తు దాహం ఒడలి బడలిక వలన కలిగింది అన్నాం. ప్రవచనాలను నెరవేర్చడానికి కలిగిందనికూడ చెప్పాం. ఇంకా ఈ దాహం నరులను రక్షించాలనే కోరికవల్ల కూడ కలిగిందని చెప్పాలి. కొందరికి సుఖభోగాలు అనుభవించాలని కోరిక. కొందరికి డబ్బు కూడబెట్టుకోవాలని కోరిక. కొందరికి పదవులూ కీర్తిప్రతిష్ఠలూ ఆర్థించాలని కోరిక. క్రీస్తుకయితే నరులను రక్షించాలని కోరిక. అతడు సమరయ మహిళను నాకు దాహమీయమని అడిగాడు. అనగా నీ హృదయాన్ని నాకు సమర్పించుకో అని అతని భావం. ఆలాగే సిలువమీదగూడ అతడు నాకు దప్పిక వేస్తుంది దాహమీయండని అడిగాడు. అనగా ఆ సిలువచేంత వున్న వాళ్ళందరూ తమ హృదయాలను తనకు అర్పించు కోవలసిందిగా కోరాడు. వాళ్ళు తన రక్షణను పొందవలసిందిగా అర్ధించాడు. కాని సిలువచెంతవన్న సైనికులు మొదలైనవాళ్ళంతా అతని ప్రేమను అర్థంచేసికోలేదు. కనుకనే వాళ్ళ తమ యెడదలనుగాక చేదు, పులిసినరసం మొదలైన పదార్థాలను అందించారు.

ఇక ప్రభువు నేడు మనలనుజూచిగూడ నాకు దప్పిక వేస్తుంది మీరు నాకు దాహమీయండి అని అడుగుతాడు.మీ హృదయాలను నా కర్పించుకోండి అని కోరతాడు. ఈ హృదయార్పణకు మనం సిద్ధంగా వున్నామా?

ఆరవ వాక్యం

"యేసు ఆ రసాన్ని అందుకొని సమస్తమూ సమాప్తమైందని పల్మాడు'

- యోహా 19,30.

క్రీస్తు జీవితంలో ప్రతి ఘట్టమూ తండ్రి నిర్దేశించినట్లే జరిగింది. అతడు ప్రతి అంశంలోను తండ్రి చిత్తానికి బద్దుడై జీవించాడు కనుక అతనియందు తండ్రి ప్రణాళికా కోరికాపూర్తిగా నెరవేరింది. పూర్వవేదంలో ప్రవక్తలు పల్కిన ప్రవచనాలుకూడ అక్షరాల నెరవేరాయి. కనుకనే క్రీస్తు సమస్తమూ సమాప్తమైంది, సమస్తమూ నెరవేరింది అని పల్కి ప్రాణాలు విడిచాడు.