పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భక్తుడు చెప్పినట్లు, క్రీస్తు తన తల్లిని ఎంతగా ప్రేమించాడో, మనమూ ఆమెను ఎంతగా ప్రేమించి గౌరవించాలని కోరుకొంటాడో, అంతగా ఆమెను ప్రేమించాలి.

మరియు వ్యాకులంద్వారా మనకు తల్లి ఐంది. మనం కూడ వేదనలద్వారా ఆమెకు బిడ్డలమైతే ఉచితంగా ఉంటుంది. మనం లేనిపోని బాధలను కొనితెచ్చుకోనక్కరలేదు. మామూలుగా మనకు సంక్రమించే బాధలను సదుద్దేశంతో స్వీకరిస్తే చాలు. వాటిని ఆ వ్యాకుల మాత శ్రమలతోను క్రీస్తు శ్రమలతోను జోడించి పరలోకంలోని తండ్రికి అర్పిస్తే చాలు, ఎనలేని ఫలితాన్ని పొందుతాం.

నాల్గవ వాక్యం

"నా దేవా నా దేవా! నన్నెందుకు చేయివిడిచావు" - మత్త 27, 46

మధ్యాహ్నం పండ్రెండునుండి మూడుదాకా దేశమంతటా చిమ్మచీకటి క్రమ్మింది. పాపాత్ములు భగవంతుణ్ణి మట్టపెడుతున్నందుకు ప్రకృతే సంతాపం తెలుపుతుందా అన్నట్లుగా వుంది ఆ దృశ్యం. నరులు జగజ్యోతిని ఆర్చివేయడానికి పూనుకొన్నారు గనుక సూర్యుడు అనుతాపంతో తన కాంతిని ఉపసంహరించుకొన్నాడా అన్నట్లుగా వుంది. పూర్వం ప్రభువు బేత్లెహేములో అర్ధరాత్రిలో జన్మించినపుడు అద్భుతంగా వెలుగు ప్రకాశించింది. కాని ఇప్పడు అతడు కల్వరిమీద మట్టమధ్యాహ్నం అవమానకరంగా సిలువపై మరణించబోతూండగా ఆకాశం చీకట్లను విరజిమ్మింది. చాలయేండ్లకు పూర్వమే ప్రవక్త "ఆ దినం నేను మధ్యాహ్నమే సూర్యుడు అస్తమించేలా చేస్తాను. పగటివేళనే భూమిమీద చీకట్ల కమ్మేలా చేస్తాను" అని నుడివాడు — ఆమోసు 8,9.

ఇంతవరకూ ప్రభువుని చీలలతో గ్రుచ్చి సిలువమీద పరుండబెట్టారు. కాని ఇప్పడతన్ని సిలువమీదికెత్తి నిలబెట్టారు. కనుక అతని దేహంలో రక్తప్రసారం సరిగా జరగలేదు. ఫలితంగా ఫనోరమైన జ్వరం పుటుకవచ్చింది, నొప్పితో దేహంలోని అవయవాలన్నీ కుదించుకొని పోయాయి. ఒక్కదేహం మాత్రమేకాదు అతని హృదయం కూడ బాధతో వ్యధతో కంపించిపోయింది. అసలు తండ్రి కూడ తన్ను చేయి విడిచాడా అన్నంతబాధ కలిగింది. ఆ సందర్భంలో ప్రభువు "నా దేవా నా దేవా! నన్నెందుకు చేయి విడిచా" వని దీనంగా విలపించాడు.

క్రీస్తు తండ్రిమీద సుమ్మర్లు పడ్డాడనిగానీ, నిరాశచెందాడనిగానీ ఈ వాక్యం భావంకాదు. ఇది అతని ప్రార్థన. ఈ వాక్యం 22వ కీర్తనలోనిది, ప్రభువు సిలువ మీద యాతన ననుభవిస్తూ ఈ కీర్తనను జపించాడు. దీనిలో ఇంకా ఈ క్రింది వాక్యాలుకూడా వున్నాయి.