పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అణగదొక్కేస్తూన్నాడు. ఇంకో విషయం. పై ధనిక జాతుల వాళ్లంతా క్రైస్తవులే. ఒకవైపు క్రైస్తవమతాన్ని పాటిస్తూనే మరోవైపు వీళ్ల ఇన్ని అత్యాచారాలు చేస్తున్నారు. క్రీస్తు తోడి ప్రజలను ప్రేమించమన్నాడా, పీడించమన్నాడా? మరి వీళ్ళు క్రీస్తు బోధలను ఏయేటిలో గలిపినట్లు?

31. ప్రజలు విూ సత్కార్యాలను చూచి పరలోకం లోని మీ తండ్రిని సన్నుతించాలి — మత్త 5,16

 సాంఘిక న్యాయం అనేది వట్టి మాటలవల్ల అయ్యేదికాదు. కేవలం సానుభూతి వల్లా అయ్యేదికాదు. మరి సత్కార్యాలవల్ల అయ్యేది. అనగా ఉన్నవాడు లేనివాణ్ణి హృదయపూర్వకంగా ఆదుకోవాలి. తనకున్నదాన్ని లేనివాడికి కొలదిగానైనా పంచి ఈయాలి. ఈలా వున్నవాళ్ళు సత్కార్యాలు చేస్తుంటే చూచి ప్రజలంతా పరలోకంలోని తండిని సన్నుతిస్తారు.
   విూదటి అంశాల్లో ఇండియాలోనైతేనేమి ప్రపంచంలోనైతేనేమి కన్పించే సాంఘిక అన్యాయాన్ని వివరించాం. ప్రపంచం మొత్తంలో ఇంచుమించు 10శాతం ధనికులు. 90శాతం పేదవాళ్లు, కాని ఈ ధనికులు 10శాతం ప్రపంచ సంపదలో 80 శాతం అనుభవిస్తున్నారు. ఇక పేదవాళ్లయిన 90 శాతానికీ మిగిలంది 20 శాతం సంపదలు మాత్రమే. ఇది సాంఘిక అన్యాయం. ఇంతమంది పేదవాళ్లు ఈలా ఎందుకు బాధపడవలసి వచ్చింది? ప్రపంచం పేదది కావడంవల్ల కాదు. పాడిపంటలూ ఖనిజసంపదలూ లోపించడం వల్ల కాదు. ప్రజలు కష్టపడి పనిచేయకపోవడంవల్లా కాదు. మరి దేనివలన? మోసంవల్లనైతేనేమి, దౌర్జన్యం వల్లనైతేనేమి, ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే సంపదలను కొంతమంది మాత్రమే కొట్టేస్తున్నారు. వాటిని మిగతావాళ్లకు దక్కనీకుండా చేస్తున్నారు.
   కనుక ప్రధానమైన సమస్య దేశం దరిద్రమై పోవడంగాదు. ఈ దేశంలో ఉత్పన్నయ్యే సంపదను ప్రజలు ఏలా పంచుకొంటున్నారు అన్నది నిజమైన సమస్య దేశంలో ఉత్పన్నమయ్యే సంపదను అందరూ కలిసిపంచుకొంటే ఇక ధనిక వర్గాలు పేదవర్గాలు అనే వ్యత్యాసాలు ఉండవు, కాని ఆ శుభదినం ఎప్పడువస్తుందో అసలు వస్తుందా?
  ఇక, ఇతరులను సంస్కరించడానికి పూనుకోకముందు మనలను మనం సంస్కరించుకోవాలి. సాంఘిక న్యాయాన్ని గూర్చి మాటలాడేపుడు ఈ సూత్రాన్ని మరచిపోగూడదు. కొలదిగానో గొప్పగానో మనం కూడా సాంఘిక అన్యాయంలో పాల్గొంటూనే వుంటాం. పెద్దగానో కొద్దిగానో మనంకూడ ఇతరులను పీడిస్తూనే వుంటాం. కనుక ఈ విషయాన్ని గూర్చి చిత్తశుద్ధితో మనకుమనమే ఆత్మవిచారం చేసికొందాం.