పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రవక్త

బైబులు భాష్యం - 39

విషయసూచిక

1 ప్రవక్తల పిలుపు
2 ప్రవక్త సేవలు
3 ప్రవచన ప్రక్రియలు
4 కపట ప్రవక్తలూ నిజ ప్రవక్తలూ
5 ప్రవక్తల శ్రమలు
6 ప్రవచనం = నాడూ నేడూ

1 ప్రవక్తల పిలుపు

ప్రభువు తనకు సేవలు చేయడానికి వివిధ మనస్తత్వాలు గల ప్రవక్తలను ఎన్నుకొన్నాడు. వీళ్ళ చాలమంది వున్నారు. ప్రస్తుతం కొందరిని గూర్చి విచారిద్దాం.

1. సమూవేలు

క్రీస్తు పూర్వం పదవ శతాబ్దంలో ప్రభువు సమూవేలును పిల్చాడు. అప్పడు యూదులు షిలోనగరంలో గుడారాన్ని పెట్టుకొని అక్కడే ప్రభువుని ఆరాధిస్తూండేవాళ్ళ ఆ రోజుల్లో ఏలీ పెద్ద గురువుగా వుండేవాడు. సమూవేలు చిన్న బాలుడుగా దేవళంలో సేవలు చేస్తున్నాడు. ఓనాడు అర్థరాత్రిలో సమూవేలు మందసంవద్ద పండుకొని నిద్రపోతుండగా ప్రభువు అతన్ని పిల్చాడు. సమూవేలు ఏలీయే తన్ను పిలుస్తున్నాడేమో ననుకొని ఆ ముసలివాని వద్దకు వెళ్ళి అతన్ని తట్టి లేపాడు, కాని యేలీ "నాయనా! నేను నిన్నుపిలువలేదు. వెళ్ళి పండుకో" అన్నాడు. ఈలా మూడుసార్లు జరిగింది. మూడవమారు ఏలీ ప్రభువే బాలుణ్ణి పిలుస్తున్నాడేమోనని శంకించాడు, దేవుడు మళ్ళా పిలిస్తే పిల్లవాడు ఏమి చెప్పాలో గూడ నేర్పించాడు. రాత్రిలో నాల్గవమారు దేవుడు మళ్ళా సమూవేలుని పిల్చాడు. ఆ బాలుడు "ప్రభూ! నీ దాసుడు ఆలించడానికి సిద్ధంగానే వున్నాడు, సెలవీయి" * అన్నాడు, అప్పడు ప్రభువు సమూవేలుకి తన సందేశం విన్పించాడు. అప్పటి నుండి అతడు ప్రభువు ప్రవక్తగా నియుక్తుడయ్యాడు - 1సమూ 3,1–10