పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తోడిజనం కూడూగుడ్డా కొరకు అలమటిస్తుంటే ఉన్నవాళ్లు తప్పకుండా సహాయం చేయాలనీ, మన విశ్వాసాన్నిక్రియాపూర్వకంగా నిరూపించుకోవాలనీ చెప్తుంది యాకోబు జాబు - 2, 14-17 ఈలాగే యోహాను మొదటి జాబుకూడ ధనికుడు పేదలకు సహాయం చేయాలని చెప్తుంది. పేదల అవసరాలను జూచి ధనవంతులు తమ హృదయ ద్వారం మూసివేసికోగూడదు. సోదరప్రేమను తీయటిమాటల్లోగాక చేతల్లో చూపించాలి - 1 యోహా 3, 17-18.

అసలు మనం తోడిజనానికి ధనంతోకంటె విశ్వాసంతోనే ఎక్కువ సహాయం చేయవచ్చు. కనుకనే ప్రభువు శిష్యులను వేదప్రచారానికి పంపినపుడు డబ్బుతీసికొని వెళ్ళవద్దన్నాడు - మార్కు 6, 7-8. పేత్రు యెరూషలేము దేవళంవద్ద కుంటివాణ్ణి నడిపించినపుడు "నావద్ద వెండి బంగారాలేమీ లేవు. ఐనా నాకున్నది నీకిస్తాను. క్రీస్తు పేరుమీదిగా నీవులేచి నడువు" అన్నాడు – అచ 3,6. ఈ సందర్భాలనుబట్టి డబ్బు అతి ప్రధానమైనది కాదని అర్థంచేసికోవాలి. ఐనా దానికుండే విలువ దానికుంది. మనంమాత్రం ఆ విలువను సద్వినియోగం జేసికోవాలి. అనగా విలువగల మన సొమ్మను అక్కరలో వున్నవాళ్ళని ఆదుకోవడానికి వినియోగించాలి.

2. తారతమ్యాలను పాటించగూడదు

లోకంలో డబ్బుకి బోలెడంత విలువ వుంటుంది. ధనవంతుడు అందరి మన్ననలు పొందుతాడు. డబ్బులేనివాడు డుబ్బకి కొరగాడు. మామూలుగా మనం ధనవంతులను గౌరవించి పేదలను చిన్నచూపు చూస్తాం. ఈ పొరపాటునే చేయవద్దంటుంది యాకోబు జాబు 2, 1–7. మంచి దుస్తులతో వచ్చిన ధనవంతుణ్ణి గౌరవించి చింపిరి దుస్తులతో వచ్చిన పేదవాణ్ణి పట్టించుకోకపోవడం తప్పు. ఈలా తారతమ్యాలను పాటించడంవల్ల సమాజంలో ధనికులు దరిద్రులు అనే వర్గాలను సృష్టించినవాళ్ళ మౌతాం. అసలు దేవుడు పేదలనే ఎన్నుకొంటాడు. వాళ్ళనే దైవరాజ్యానికి వారసులను చేస్తాడు. ఆలాంటివాళ్ళను మనం చిన్నచూపు చూడ్డం అవివేకం గదా! తొలినాటి క్రైస్తవసమాజంలో ధనికులు దరిద్రులు అనేవాళ్ళవల్ల వచ్చిన సమస్యలను ఈ వాక్యాలు స్పష్టంగా తెలియజేస్తాయి. ఇంకా యీ జాబు ధనవంతులను హెచ్చరిస్తుంది. భాగ్యవంతులు అన్యాయమైన పద్ధతిలో సొమ్ము కూడబెట్టారు. ఇప్పుడు సుఖభోగాలు అనుభవిస్తున్నారు. కాని దేవుడు వాళ్ళకు తీర్పు తీర్చడానికి సిద్ధంగా వున్నాడు. కనుక వాళ్ళ పశ్చాత్తాపపడి కన్నీళ్ళ కార్చాలి. లేకపోతే నాశమైపోతారు-5, 1-6.