పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. డబ్బు అనర్థాలన్నిటికీ మూలం

పౌలు డబ్బును గూర్చి నిశితమైన హెచ్చరికలు చేసాడు. ధనాపేక్ష సర్వ అనర్థాలకూ మూలం అన్నాడు - 1తిమొు 6,10. ఈ వాక్యం ప్రభావాన్ని నేటి మన క్రైస్తవ సమాజాల్లో కన్నులార చూస్తూనే వున్నాం. డబ్బు మీద కోరికలు పెట్టుకొన్నవాడు దేవుణ్ణి తోడి ప్రజలనూ లెక్కచేయడు. చేయరాని పనులు చేసి చెడిపోతాడు. మనకు మామూలు కూడూ గుడ్డా చాలు. వాటితో తృప్తి చెందక డబ్బుమీద విపరీతమైన కోరిక పెట్టుకొంటే చివరకు ఆ కోరికే మనకు మృత్యుపాశమై కూర్చుంటుంది - 1తిమొు 6, 8– 9. కనుక ధనవంతులు చంచలములైన సంపదలపై మనసు నిల్పుకోగూడదు. అహంకారంతో విర్రవీగకూడదు. మరి దేవునిపై ఆధారపడి జీవించాలి. ఉదారబుద్ధితో తమకున్నదానిని ఇతరులతో పంచుకోవాలి - 1తిమొు 6, 17-18.

ఇంకా, ఈలోక వస్తువులతో మెలిగేవాళ్లు వాటితో తమకు సంబంధంలేనట్లే వ్యవహరించాలి. అనగా ఈ ప్రపంచ వస్తువులమీద మనసు పెట్టుకోగూడదు. వాటికి దాసులు కాగూడదు. అసలు ఈ ప్రపంచమే అనతి కాలంలో నశిస్తుంది. కనుక శిష్యుడు వస్తుదాస్యాన్నీ వస్తమమకారాన్నీ అరికట్టాలి - 1కొరి 7, 30-31.

పూర్వవేదం సంపదను దేవుని వరంగా భావించిందని చెప్పాం. కాని నూతవేదం దాన్ని ఆలా గణించదు. పైగా ధనాన్ని ప్రలోభ కారణంగా ఎంచుతుంది. డబ్బు నరుణ్ణి శోధించి పాపమార్గాన్ని పట్టించేది. కనుక నరుడు దాన్ని అతిజాగ్రత్తగా వాడుకోవాలని హెచ్చరిస్తుంది. ధనాన్ని సోదరప్రజలు అవసరాలను తీర్చడానికి వినియోగించడం ఉత్తమమైన మార్గం అనికూడ చెప్తుంది.

4. నేటి క్రైస్తవ సమాజమూ సంపదలూ

ధనాన్ని గూర్చిన బైబులు బోధలను పరిశీలించి చూచాం. సంపదలను గూర్చిన క్రీస్తు భావాలను అర్థం చేసికొన్నాం. కాని ఈ బోధలను ఈనాటి మన క్రైస్తవ సమాజానికీ, మన వ్యక్తిగత జీవితానికీ అన్వయించుకోవడం ఏలా?

1. సంస్థగా శ్రీసభ

భారతదేశ క్రైస్తవులు చాలమంది పేదవాళ్ళు. తక్కువ కులాలకు చెందినవాళ్ళకూడ అందుచేత సిరిసంపదలు తెచ్చిపెట్టే సమస్యలు మన క్రైస్తవ సమాజాలను అంతగా బాధించవు. కాని మన క్రైస్తవులు పేదవాళ్ళయినా ఇండియాలో శ్రీసభ మాత్రం పేదది ఎంతమాత్రమూ కాదు. సంస్థగా మన శ్రీసభ సుసంపన్నమైనదని అందరికీ తెలుసు.