పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10. నీతిమంతులూ, హృదయశుద్దీ

బైబులు నీతిమంతులను చాలసార్లు పేర్కొంటుంది. వాళ్ళను దుర్మార్గులతో పోల్చి చూపుతుంది. నీతిమంతుల్లో కనిపించే ప్రధానలక్షణం చిత్తశుద్ధి వాళ్ళ నిర్దోషులు, ధర్మాన్ని పాటించేవాళ్ళు, సత్యం పలికేవాళ్ళు, తలపుల్లోను చేతల్లోను నిర్మలంగా వుండేవాళ్లు. కనుకనే వాళ్ళకు ప్రభు మందిర ప్రవేశమూ, ప్రభు దర్శనభాగ్యమూ లభిస్తుంది, దేవుడు ఆకాశాన్నుండి భూమిమీదికి పారజూస్తాడు. ఎవరయినా నీతిమంతులు తన్నుపూజిస్తున్నారా అని పరిశీలిస్తాడు. దేవదారులాగ పెరిగి తాత్కాలికంగా వృద్ధిలోకి వచ్చినా, దుర్మార్గులేమో సర్వనాశమైపోతారు. కాని నీతిమంతుణ్ణి ప్రభువు చేయి విడువడు. అతని బిడ్డలు అడుక్కొని తినవలసిన యవసరంలేదు. ఎవరు నీతిమంతులో, ఎవరు కుటిలబద్దలో ప్రభువుకి తెలుసు. ఆయన సరళబుద్ధి కలవానితో సరళంగాను, కపటబుద్ధి గలవానితో కపటంగాను ప్రవర్తిస్తాడు. నీతిమంతులు నానా బాధలకు గురౌతారు. ఐనా ప్రభువు వాళ్ళను విడనాడడు. ఒడ్డు చేర్చితీరతాడు. సజ్జనులకు చీకటిలో గూడ వెలుగు ప్రకాశిస్తుంది. దుర్మార్డులు ఆపదల్లో చిక్కి అణగారిపోతారు.

1.ప్రభూ! నీ మందిరంలో వసింపగలవా డెవడు?
నీ పరిశుద్ధ పర్వతంమీద నిలువగలవా డెవడు?
నిర్దోషిగా మెలిగేవాడూ, ధర్మాన్ని పాటించేవాడూ, సత్యపాలకుడూ
పరనింద చేయనివాడూ, మిత్రద్రోహం తలపెట్టనివాడూ!
ఇరుగుపొరుగువాళ్ళమీద నిందలు మోపనివాడూను - కీర్త 15, 1-3
2. ప్రభువు కొండమీది కెక్కగలవా డెవడు?
ఆయన దేవళంలో అడుగు బెట్టగలవా డెవడు?
తలపులలోనూ చేతలలోనూ నిర్మలుడైనవాడూ.
విగ్రహారాధనకు పూనుకోనివాడూ,
దొంగప్రమాణాలు చేయనివాడూను - 24, 3-4
3.ఆకాశంనుండి ప్రభువు భూమిమీదికి పారజూస్తుంటాడు
నరుల్లో ఎవరైనా వివేకవంతులున్నారా అనీ,
ఎవరైనా తన్ను పూజిస్తున్నారా అనీ పరిశీలిస్తుంటాడు - 14, 2
4.నేను ఓ దుర్మార్ణుడు వృద్ధిలోకి రావడం జూచాను
అతడు దేవదారులాగ ఎదిగిపోయాడు
నేను మళ్ళా ఆ చోటికివెళ్ళి చూద్దునుగదా అతడు గతించాడు
అతనికోసం గాలించానుగాని అతడు కన్పించలేదు — 37, 35-36