పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22. నరుని ధ్యేయం

100. ఇగ్నేప్యస్ ఈ క్రింది వాక్యాలతో ఫ్రాన్సిస్ జేలియర్ మనసు మార్చి అతన్ని తన శిష్యుణ్ణిగా జేసికొన్నాడు "నరుడు ఈ లోకాన్నంతటినీ జయించినప్పటికీ తన ప్రాణాన్ని కోల్పోతే అతనికి ఏమి లాభం కలుగుతుంది? ఈ లోకజీవితం మాత్రమేవుంటే, ఈ లోకమహిమ మాత్రమే వుంటే నీవు ఇక్కడ గొప్పవాడివిగా చలామణి కావడంలో అర్ధంవుంది. కాని శాశ్వత జీవమనేది ఇంకొకటివుంటే - అది తప్పకుండా వుంది - నీవు నీ కోరికలను ఈ యిహలోకానికి పరిమితం చేసికోవచ్చా? కలలా దాటిపోయే ఈ లోకాన్ని నమ్మకొని ఏనాటికీ ముగియని ఆ నిత్యలోకాన్ని పోగొట్టుకొంటావా? నీ ప్రయత్నవల్లనే నీవు మోక్షంకంటె విలువైన వస్తువునీ, శాశ్వతంకంటె ఎక్కువకాలముండే సంపదనీ గడించగలవా? ఆ మోక్షమూ శాశ్వతత్వమూ నీ కొరకు ఉద్దేశింపబడినవి కావా? నీవు వాటిని సంపాదించుకోవాలనుకొంటే నీకు ఎవరు అడ్దమొస్తారు? నీవు వాటిని సంపాదించుకొన్నాక నీ నుండి వాటిని ఎవరు తీసికొనిపోగలరు? నీవు నా ఆత్మకు ఈ లోకానందాన్ని చేకూర్చి పెట్టాలనుకొంటున్నావు. కాని ఆ యాత్మ పరలోకానికి చెందింది కాదా? దేవుణ్ణి ప్రేమించి అతన్ని శాశ్వతంగా పొందగలిగే ఆత్మకు క్షణికమైన ఈ లోకవస్తువులు తృప్తినిస్తాయా? ఈ లోకం తానీయ గలిగిన ఆనందాలన్నిటినీ నీకు తత్క్షణమే యిచ్చినా, నీవు వాటిని ఎంతకాలం అనుభవిస్తావు? నీవు ఇక్కడ గడిపే కొద్దిపాటి జీవిత కాలంలోనేగదా? నీవు ఎన్నివందల యేండ్ల జీవించినా ఒకరోజు మరణించక తప్పదు కదా! ఈ తాత్కాలికానందం కోసం దేవుణ్ణి శాశ్వతంగా కోల్పోతే నీకేమైనా లాభం కలుగుతుందా? నీకు ముందు ఈ లోకంలో ఎందరు ధనవంతులు బలవంతులు జీవించలేదు? వాళ్ళల్లో ఎవరైనా తమ సంపదలను గాని గొప్పతనాన్ని గాని అధికారాన్ని గాని తమతో తీసికొని పోగలిగారా? వాళ్ళ ఆ శాశ్వత లోకంలో అడుగు పెట్టగానే తమభూలోక సంపదలు ఇతరుల హస్తగత మయ్యాయని గుర్తించారు. వాళ్ళకు ఈ లోక సంపదలకు బదులుగా పరలోకంలో నూత్నసంపదలు లభింపలేదు. ఇక్కడ తాముచేసిన పనులనుబట్టి మాత్రమే వాళ్లకు పరలోకంలో ప్రతిఫలం ముట్టింది. ఈ లోక గౌరవాలు నీకు తృప్తినీయలేవు. ఈ లోకాన్నంతటినీ స్వాధీనం చేసికొన్నానీ హృదయం తృప్తి జెందదు. దేవుడు తప్ప మరే వస్తువూ నీ హృదయాన్ని నింపలేదు. కీర్తిని గణించాలనే నీ కోరికను నేను అణచివేయడంలేదు. నేను నీకు క్షుద్రమైన ఆశయాలను చూపించడంలేదు. నీవు గొప్ప కోరికలే కోరుకో ఉన్నతమైన ఆశయాలే పెట్టుకో. కాని నీవు నశ్వరమైన ఇహలోక వస్తువులను త్యజించి అనశ్వరమైన పరలోక వస్తువులను కోరుకో ఇప్పుడే ఈలోక వస్తువులవల్ల నాకు ఏమి లాభం కలుగుతుందా అని ఆలోచించి చూచుకో, లేకపోతే వీటిని ఈ లోకంలో కొంతకాలంపాటు గ్రుడ్డిగా అనుభవిస్తావు. అటుతర్వాత పరలోకంలో ఆ భూలోక వస్తువులవల్ల నాకు ఏమి ప్రయోజనం కలిగిందా అని శాశ్వతకాలం వరకు దుఃఖిస్తావు."