పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కవాటం వద్ద నిలబడి తట్టగలదే గాని, తలుపు తెరచుకొని నేరుగా మన హృదయంలో ప్రవేశింపలేదు. కనుక మనం తలచుకొంటేచాలు, దాని ప్రబోధాలను సులభంగా అణచివేయవచ్చు. కాని ఒకమారు పిశాచానికి భయపడి దాని శోధనలకు లొంగిపోయి దాన్ని హృదయంలో ప్రవేశింపనిచ్చామో, ఇక అది మహాదారుణంగా మనమిూద పరిపాలన చేస్తుంది. ఓ క్రూరమృగం లాగ మనలను చీల్చివేస్తుంది. మనం దానికి బానిసలమై పోతాం.

13. పిశాచం పరస్త్రీని చెరపజూచే దుష్ట ప్రేమికుని లాగ ప్రవర్తిస్తుంది. పరస్త్రీని మోసం జేయగోరే దుష్ట ప్రేమికుడు ఆమె తన పన్నాగాలను భర్తకు గాని తండ్రికి గాని తెలియజేయకుండా వుండాలని కోరుకొంటాడు. ఒకవేళ ఆమె ఆ దుష్ట ప్రేమికుని కుతంత్రాలను తనవాళ్లకు ఎరుకపరిస్తే అతనికి పట్టరాని కోపం వస్తుంది. ఎందుకంటే అతని ఆటలు ఇక సాగవు గనుక. అలాగే పిశాచం గూడ తాను కలిగించే శోధనలను మనం పెద్దలకూ ఆత్మగురువులకూ తెలియజేయకుండా వుండాలని కోరుకొంటుంది. అలా తెలియజేస్తే దానికి విపరీతమైన కోపం వస్తుంది. ఎందుకంటే దాని పప్పలు ఇక ఉడకవు గనుక. అందుచేత దయ్యం "ఈ శోధనలను పెద్దలకు తెలియజేస్తే వాళ్లేమనుకొంటారో, మనలను చిన్నచూపు చూస్తారు గాబోలు" అనే భావాలను పట్టిస్తుంది. కుతర్కాలను కలిగించి మనం నిజం చెప్పడానికి వెనుకాడేలా చేస్తుంది. కనుక మనం పిశాచానికి లొంగిపోకుండా వండాలంటే శోధనలు ఎదురైనపుడు వెంటనే తగిన పెద్దలకు తెలియజేస్తుండాలి. ఆ పెద్దల సలహాలను పాటిస్తుండాలి. లేకపోతే పై యుదాహరణం లోని అమాయకురాలైన స్త్రీ లాగ మోసపోతాం.

14. పిశాచాన్ని శత్రువుల కోటను ముట్టడించే సైన్యాధిపతితో గూడ పోల్చవచ్చు సైన్యాధిపతి కోటగోడ చుటూ తిరిగిచూచి గోడ ఎక్కడ బలంగాలేదో అక్కడ ముట్టడి ప్రారంభిస్తాడు. అలాగే నరజాతి శత్రువైన పిశాచం గూడ మనలను జాగ్రత్తగా పరిశీలిస్తుంది. మన లోపాలనూ బలహీనతలనూ నిశితంగా తెలిసికొంటుంది. మన బలహీనతల ద్వారానే మనలను శోధించి కూలద్రోస్తుంది. కొందరిలో సోమరితనమూ, కొందరిలో గర్వమూ, కొందరిలో కామవాంఛా, కొందరిలో అసూయా - ఈలా రకరకాల జనుల్లో రకరకాల లోపాలుంటాయి. పిశాచం ఈ లోపాల ద్వారానే వీళ్లను పడదోస్తుంది. అందుకే పేత్రు మొదటి జాబు, మన శత్రువైన పిశాచం గర్జించే సింహం లాగ ఎవరిని మింగుదామా అని రౌద్రంగా తిరుగాడుతూంటుందని వాకొంటుంది - 5,8,

15. పిశాచం మామూలుగా నరులకు కలిగించే శోధనలు ఇవి, మొదట సుఖభోగాల విూద వాంఛ పట్టిస్తుంది. ఆ మిూదట ధనవాంఛ కలిగిస్తుంది. అటుతరువాత పదవులూ బిరుదాలూ గౌరవాలూ కీర్తి ప్రతిష్ఠలూ మొదలైన వాటిని కాంక్షించేలా చేస్తుంది.