పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జరిగినట్లే ఉదహరణకు ఇద్దరు కాలేజీ యువకులకు ప్రక్కకాలేజి యువతులతో స్నేహం ఏర్పడింది. ఒక యువకుని స్నేహం నిర్మలంగా ప్రారంభమైంది. నిర్మలముగానే కొనసాగింది. మరొక యువకుని స్నేహం నిర్మలంగానే ప్రారంభమైందిగాని కొంత కాలమైనాక పాపానికి దారి తీసింది. వీటిల్లో మొదటి స్నేహం సదాత్మ ప్రేరణంవల్లా, రెండవస్నేహం దుష్టాత్మప్రేరణంవల్లా కలిగాయి. ఈలాగే మనకు కలిగే ఆనందానుభూతితో మనం చేసే పనులకుగూడ పై నియమాన్నే అన్వయించి చూడాలి. ఆపనుల ప్రారంభమూ, మధ్యమూ అంతమూ మూడూ మనలను దేవుని వైపు నడిపిస్తున్నాయో లేదో పరిశీలించి చూచుకోవాలి. ఈ విషయంలో ఒకమారు పిశాచం వలన వంచితులమయ్యామో, రెండవ మారు జాగ్రత్తగా వండాలి.

3. విచారానుభూతి

9. విచారానుభూతి అంటే మనసులో ఓ విధమైన విచారమూ నిరాశా గోచరిస్తాయి. మన కోర్కెలు సృష్టికర్తను విడనాడి సృష్టివస్తువులవైపు పోతాయి. క్షుద్రవస్తువులను కోరుకొంటాయి. హృదయంలో ఒకవిధమైన అంధకారమూ, క్షోభమూ, అపనమ్మికా, నిరుత్సాహమూ, నిరాశా గోచరిస్తాయి. శోధనలు బలంగా వస్తాయి. విశ్వాసమూ నమ్మికా దేవప్రేమా సన్నగిల్లి పోతాయి. దేవునితో సంబంధం తెగిపోయిందా అనిపిస్తుంది. ప్రార్ధనం రుచించదు. ఓ విధమైన బద్ధకింపూ సోమరితనమూ జనిస్తుంది. హృదయం నీళ్లు వట్టి పోయిన మడుగులా వుంటుంది. మొత్తము విూద విచారానుభూతి వలన కలిగే భావాలు ఆనందానుభూతి వలన కలిగే భావాలకు విరుద్ధంగా వుంటాయి. ఈ గుణాలు మూమూలుగా ఆత్మలో కన్పిస్తాయి. కాని ఒకోమారు ఇవి యింద్రియాలకు గూడ ప్రాకవచ్చు. అప్పడు విపరీతమైన నిరుత్సాహమూ నీరసభావాలూ గోచరిస్తాయి.

10. విచారానుభూతి ఏందుకు కలుగుతుంది? మూడు కారణాల వల్ల విచారానుభూతి పట్టవచ్చు, మొదటిది, మన నులివెచ్చనితనం. మనం ప్రభుసేవలో శ్రద్ధచూపం. పట్టీపట్టనట్లుగా ప్రవర్తిస్తాం. దానికి గాను ప్రభువు మనలను శిక్షించి మన హృదయం ఎండిపోయేలా చేస్తాడు. ఆనందానుభూతిని నిరాకరిస్తాడు. అమ్మ పోకిరి పిల్లలకు మిఠాయి పెట్టదుగదా! రెండవది, దేవుడు మనలను పరీక్షించడానికై విచారానుభూతి కలిగిస్తాడు. ఆనందానుభూతితో దేవుణ్ణి సేవించడం సులభం. కాని విచారానుభూతిలో వున్నపుడు అతణ్ణి సేవిస్తామా లేదా అని పరీక్షించి చూడ్డానికై భగవంతుడు మనకు ఈలాంటి కష్టానుభూతినిస్తాడు, మూడవది, మనకు వినయాన్ని నేర్పించడం కోసం, మనం నిత్యం ఆనందానుభూతినే అనుభవిస్తుంటే ఇక పరిశుద్దులమై పోయామనీ దేవుని అనుగ్రహానికి పాత్రులమై పోయామనీ విర్రవీగుతాం. వినయాన్నికోల్పోతాం. దేవుణ్ణి మరచిపోతాం. కనుక మన పాపస్వభావాన్ని మనం గుర్తించడం కోసం దేవుడు విచారానుభూతిని కలిగిస్తాడు.