పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1. ప్రారంభ విషయాలు

1. మన అంతరాత్మలో మూడు శక్తులు పనిచేస్తుంటాయి. మొదటిది పిశాచం. "మిూరు తోటలోని ఏ చెట్ట పండూ తినగూడదట నిజమేనా?” అని పిశాచం ఏవను శోధించింది- ఆది 3.1. నాటి నుండి నేటిదాకా దయ్యం నరులను పాపానికి పరికొల్పుతూనే వుంది. రెండవశక్తి దేవుని ఆత్మ పరిశుద్దాత్మ మన హృదయానికి ప్రబోధం కలిగించి మనలను క్రీస్తువైపు నడిపిస్తుంటుంది. ఓవైపు పిశాచం బిడ్డలను పిశాచం నడిపిస్తూంటే మరోవైపు దేవుని బిడ్డలను దేవుని ఆత్మ నడిపిస్తుంటుంది-రోమా 8,14. ఈ పరిశుద్ధాత్మతో పాటు దేవునిదూతలు కూడ మంచిని చేయమనీ చెడుగును వారించమనీ మనలను ప్రోత్సహిస్తుంటారు. ఈ దూతలు నిత్యం మనకు తోడ్పడుతుంటారు - హెబ్రే 1,14. ఇక మూడవశక్తి, మన పతనస్వభావం. ఆదాము పాపఫలితం మనకు సోకింది. జన్మపాపం నరులందరినీ కూలద్రోసింది. ఈ పతనం వలన మన ఆధ్యాత్మికశక్తులు పూర్తిగా నాశమైపోలేదు గాని, గాయపడ్డాయి. దీని ఫలితంగా మనలో దుష్టవాంఛలు రేకెత్తాయి. మనం మంచిని గాదు, చెడ్డను కోరుకొంటాం, పాడుపనులు చేస్తాం - యాకో 1,14.

పై మూడు శక్తులూ నిత్యమూ మనలను ప్రభావితులను చేస్తూంటాయి. అందుచేత ఎప్పడు మనలను పవిత్రాత్మప్రబోధిస్తుందో, ఎప్పడు అపవిత్రాత్మప్రబోధిస్తుందో, ఎప్పడు మన దుష్టవాంఛలే మనలను పరికొల్పుతుంటాయో తెలిసికోగలిగి వుండాలి. ఈ తెలివిడికే సదసదాత్మవిచారం అని పేరు.

2. ఇగేష్యన్ లొయోలాగారు సదాత్మలూ అసదాత్మలూ కలిగించే ప్రబోధాలను చక్కగా అనుభవానికి తెచ్చుకొన్నవారు. ఆయన ఈ విషయాన్ని గూర్చి ఎన్నో సూచనలు తయారుచేసి భావితరాలవాళ్లకు అందించిపోయాడు. ఇక్కడ సదసదాత్మలను గూర్చి ఇగ్నేప్యను చెప్పిన సూత్రాలను కొన్నిటిని పరిశీలిద్దాం.

కొంతమంది జనులు పాడుజీవితం జీవిస్తూంటారు. పాపాల తర్వాత పాపాలు చేస్తూంటారు. ఈ పాపాలు మోసం, గర్వం, దొంగతనం, వ్యభిచారం, వంచన— ఈలాంటివి ఏవైన కావచ్చు. ఈలాంటివాళ్ళకు సదాత్మ మనస్తాపం పట్టిస్తుంది. వాళ్ల అంతరాత్మను హెచ్చరిస్తుంది. పూర్వపు మంచిజీవితాన్ని జ్ఞాపకానికి తెస్తుంది. మరణమూ, కడతీర్పూ, నరకమూ మొదలైన అంత్యగతులను తలంపునకు తెస్తుంది. ఈలాచేసి పాపి తన జీవితం మార్చుకొనేలా చేస్తుంది. కాని అసదాత్మ ఆ పాప జీవితంలోనే సంతోషం కలిగిస్తుంది. ఇంద్రియ సుఖభోగాల వైపు మనసు త్రిపుతుంది. ప్రస్తుతం అనుభవించే సుఖాన్నీ భావిలో అనుభవింపబోయే సుఖాన్నీ జ్ఞప్తికి తెస్తుంది. "ఈ యింద్రియ సుఖాలను వదలుకోవడమా!" అనే శంక కలిగిస్తుంది.