పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కనుక పాపజీవితం జీవించేవాళ్ల ఆ జీవితాన్ని సమర్ధించే భావాలు కలిగినపుడు అవి పిశాచం నుండి వచ్చాయని గుర్తించాలి. ఆ జీవితాన్ని ఖండించే భావాలు కలగినపుడు అవి పరిశుద్దాత్మ నుండి పుట్టాయని గుర్తించాలి. ఎప్పడూ ఈ యాత్మలు రెండూ తమస్వభావానికి తగినట్లుగా ప్రవర్తిస్తాయి. కనుక దుష్టాత్మ దుష్టభావాలనూ, సదాత్మ సద్భావాలనూ కలగిస్తుంటుంది.

3. కొంతమంది జనులు పాపజీవితం వదలుకొని పుణ్యమార్గంలో నడిచే ప్రయత్నం చేస్తూంటారు. పూర్వం చేసిన దుష్టకార్యాలను వదలివేసి సన్మార్గానికి వస్తారు. తమ పాపాలకు పశ్చాత్తాప పడతారు. అలాంటివాళ్ల విషయంలో సదాత్మ అసదాత్మ ఏలా ప్రవర్తిస్తాయి? సదాత్మ ధైర్యమూ ఉత్సాహమూ పుట్టిస్తుంది. ఆనందమూ మనశ్శాంతీ ప్రసాదిస్తుంది. ఈలాంటి మనోభావాలతో ఆయాత్మ భక్తుణ్ణి పాపమార్గం నుండి వైదొలగిస్తుంది. అతన్ని బుజ్జగించి ముందుకు నడిపిస్తుంది. కాని అసదాత్మ భక్తునికి ఆటంకాలు తెచ్చిపెడుతుంది. ఆందోళనమూ సంకోచమూ విచారమూ పుట్టిస్తుంది. "ఈ సుఖాన్ని వదలుకోవడం సాధ్యమా? ఈ పని చేయకుండా వుండగలమా?" అనే కుతర్కాన్ని రేకెత్తిస్తుంది. ఈలాంటి ఆలోచనలతో అతన్ని పాపమార్గంలోనే వుంచే ప్రయత్నం చేస్తుంది.

జీవితంలో అప్పడప్పడూ కొన్ని పెద్దపాపాలకు అలవాటు పడిపోతాం. కాని కొంతకాలమయ్యాక దైవానుగ్రహం వల్ల ఆ పాపాలను విడనాడాలనే బుద్ది పడుతుంది. కొంత ప్రయత్నం గూడ చేస్తాం. ఆ సందర్భంలో మన హృదయంలో కలిగే భావాలు ఏయాత్మ నుండి వచ్చాయో తెలిసికోవడం ఏలాగ? ఆ భావాలు పూర్వం అలవాటు పడిన పాపాన్ని వదలిపెట్టమని ప్రోత్సాహిస్తుంటే అవి సదాత్మ నుండి వచ్చినట్లు, పూర్వపాపాన్ని వదలి పెట్టవద్దని చెపూంటే అవి దుష్టాత్మనుండి వచ్చినట్లు.

4 వరప్రసాదస్థితిలో వుండి పుణ్యజీవితం జీవించేవాళ్ల హృదయం విూద సదాత్మ చాలా మృదువుగా పనిచేస్తుంది. ఆ యాత్మ ప్రబోధం స్పాంజ్మిూద నీటిబొట్ట పడినట్లుగా నిశ్శబ్దంగా మెత్తగా వుంటుంది. కాని అదే ప్రజల హృదయం విూద పిశాచమైతే చాల కటువుగా, గోలగా, ఆందోళనపూరితంగా పనిచేస్తుంది. నీటుబొట్టు రాతిమిూద పడినట్లుగా చిటుక్కుమనిపిస్తుంది. ఈ యాత్మలు తమకు అనుకూలంగా ప్రవర్తించేవాళ్ల విూద మృదువుగా పనిచేస్తాయి. కనుక మనం మంచి జీవితం జీవిస్తున్నపుడు మన హృదయంలో మృదువైన ప్రబోధం కలిగితే అది పరిశుద్దాత్మ నుండి వచ్చిందని గుర్తించాలి. అలా కాకుండ ఏదోశక్తి మన హృదయాన్ని కటువుగా కదలించివేసినట్లుగా వుంటే అది పిశాచం నుండి వచ్చిందనుకోవాలి.