పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీరు వాడవద్దు. సక్రమమైన తూకపరాతిని ఒక్కదాన్నే ఉపయోగించండి. అప్పుడు ప్రభువు మీ కిచ్చిన గడ్డమీద మీరు చిరకాలం జీవిస్తారు. తూకాల్లో కొలమానాల్లో మోసం జేసేవాళ్ళను ప్రభువు ఈసడించుకొంటాడు" - ద్వితీ 25, 13 -16. "దొంగతూకాలనూ దొంగ కొలమానాలనూ వాడేవాళ్ళను ప్రభువు అసహ్యించుకొంటాడు" - సామె 20,10. దొంగ తక్కెళ్ళను వాడేవాళ్ళను అతడు చీదరించుకొంటాడు. న్యాయమైన తూకాలు తూచేవాళ్ళంటె అతనికి ఇష్టం - 11,1. ప్రభువుకి పేదప్రజలంటే అపారమైన కరుణ గనుక ధనవంతులు వాళ్ళకు అన్యాయం చేయకుండా ఉండాలని అతని కోరిక. అతని ఆజ్ఞమీరి పేదలను బాధించినవాళ్ళని ఆ ప్రభువు శిక్షిస్తాడు. అతడు పీడితులకు కొమ్మ కాసేవాడు. - కీర్త 146,7. దరిద్రులంటే ఆ ప్రభువుకి ఎంత దయో అర్థం చేసికోవడానికి ఈ వొక్క శాసనం చాలు. "మీరు ఎవరిని మోసగించవద్దు. ఎవరికీ అన్యాయం చేయవద్దు. మీకు కూలిచేసిన కూలివాని కూలిని ఒక్కరేయికూడ మీవద్ద ఉంచుకోవద్దు. చెవిటివానిని శపించవద్దు. గ్రుడ్డివాని కాళ్ళకు ఏదైనా అడ్డంపెట్టి వాణ్ణి క్రిందపడవేయవద్దు" - లేవీ 19,13-14.

4. విశ్రాంతి వత్సరం

యూదప్రజల్లో నాడునాటికి స్వార్థం పెరిగిపోయింది. ధనవంతులు పేదలను బానిసలనుజేసి వాళ్ళచేత వెట్టిచాకిరి చేయించుకొంటున్నారు. వాళ్ళ పొలాలను స్వాధీనం చేసికొంటున్నారు. ఈ యన్యాయాలను అరికట్టడానికై ధర్మశాస్త్రం ముందుగనే రెండు నియమాలు చేసింది. మొదటిది విశ్రాంతి వత్సరం, రెండవది విడుదల వత్సరం. ఈ రెండిటిని పరిశీలిద్దాం.

విశ్రాంతి వత్సరం ప్రతి యేడవయేడు వచ్చేది. ఈ యేట యూదబానిసలందరికి స్వాతంత్ర్యం వచ్చేది. వాళ్లు పూర్వం బాకీలవల్ల బానిసలయ్యారు. ఏడవయేట ఆ బాకీలన్నీ రద్దయ్యేవి. వాళ్ళకు స్వేచ్ఛ లభించేది. ఈలా యూదబానిసలు ఆరేండ్ల పనిచేసి ఏడవయేడు స్వాతంత్ర్యం సంపాదించుకొనేవాళ్లు, ఇంకా ఈ విశ్రాంతియేట పొలాన్ని దున్నకుండా బీడుగా వుంచేవాళు. భూమికూడా విశ్రాంతి పొందాలనీ దానిలోని సారం సమసిపోకుండా వండాలనీ ఈ నియమం భావం. మామూలుగా దేవుడు ఆరవయేడు ఇబ్బడిగా పంటనిచ్చేవాడు. ఆ పంటతోనే ప్రజలు నేల బీడుగావున్న ఏడవయేడుకూడ బ్రతికేవాళ్లు.