పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

13. నూతన ఆజ్ఞ - యోహా 13,34

ప్రభువు సోదరప్రేమను నూతన ఆజ్ఞ అని పేర్కొన్నాడు. కాని ఇది నూతన ఆజ్ఞ ఏలా ఔతుంది? లేవీయ కాండం 19, 18 నిన్నువలె నీ పొరుగువారిని ప్రేమించమని చెప్తూంది కదా? సోదరప్రేమను గూర్చిన ఆజ్ఞయేమో మోషే ధర్మశాస్త్రంలో గూడ వుంది. కాని ధర్మశాస్త్రం మనం సోదరప్రేమను ఎందుకు పాటించాలో చెప్పదు. యావే ప్రభువుని ఆదర్శంగా పెట్టుకొని, సోదరప్రేమను పాటించాలని పూర్వవేదం ఎక్కడా చెప్పదు. కాని నూత్నవేదంలో క్రీస్తు మనం తన్ను ఆదర్శంగా బెట్టుకొని సోదరప్రేమను పాటించాలని చెప్పాడు. "నేను మిమ్మ ప్రేమించినట్లే విూరూ ఒకరినొకరు ప్రేమించాలి" అన్నాడు. ఈలా క్రీస్తుప్రేమ మనకు ఆదర్భంగా వుండడంవల్లనే అతడు బోధించిన ప్రేమాజ్ఞక్రొత్త ఆజ్ఞ అయింది. ఆజ్ఞయేమో క్రొత్తదికాదు. అతడు దానికి ఆదర్శంగా వుండడం మాత్రం క్రొత్త.

ఏమిటి ఈ యాదర్శం? క్రీస్తు మనలకు అంతం వరకు ప్రేమించాడు - అనగా తన శక్తికొలది పరిపూర్ణంగా ప్రేమించాడు - యోహా 13,1. స్నేహభావంతో శిష్యుల కాళ్ళు కడిగాడు - 13,14. మన కోసం తన ప్రాణాలను ధారపోయడానికి సంసిద్ధమయ్యాడు - 15,13. అతని ప్రేమ అంత చిత్తశుద్ధితో కూడింది, అంత పవిత్రమైంది. ఆ పవిత్రప్రేమే మన సోదరప్రేమకు కూడ ఆదర్శం.

పూర్వాంశంలో తండ్రిప్రేమ మనకు ఆదర్శంగా వుంటుంది అని చెప్పాం. అలాగే కుమారుని ప్రేమకూడ మనకు ఆదర్శంగా వుంటుంది.

14. క్రీస్తు శిష్యులకు గుర్తు - యోహా 18,35

మనం క్రీస్తు శిష్యులం అనడానికి గుర్తు ఏమిటి? ఏ లక్షణాన్ని బట్టి లోకం మనలను క్రైస్తవులుగా గణిస్తుంది? సోదరప్రేమను బట్టే. పూర్వం పరిసయులు ముఖపట్టికలు ధరించేవాళ్లు. అది ఆ శాఖీయులకు గుర్తు. స్నాపక యోహాను శిష్యులు యోర్గాను స్నానాన్ని తమ శాఖకు గుర్తుగా నిర్ణయించుకొన్నారు. అలాగే క్రీస్తు శిష్యులకు గూడ ఓ గుర్తు వుంది. అదే సోదరప్రేమ.

అనగా ఈ సోదరప్రేమ మరోవర్గం వాళ్ళల్లో వుండదు. అది క్రీస్తు శిష్యులకు ప్రత్యేకం. దాని ద్వారా వాళ్ళ క్రీస్తుకి సాక్ష్యం పలుకుతారు. క్రీస్తు ఈ గుర్తుని తన జీవితపు చివరి గడియల్లో శిష్యులకు ప్రసాదించాడు. కనుక అది అతని వీలునామా లాంటిది. కలకాలమూ ఇది శిష్యులకు గుర్తుగా వుండాలి. సోదరప్రేమ లేనివాడికి ఆ శిష్యవర్గంలో చేరేహక్కు లేదు.