పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చంపదగినయట్టి శత్రువు తనచేత

జికెనేని కీడు సేయరాదు

పొసగ మేలుచేసి పొమ్మనుటే చావు.

11. పరలోకంలోని తండ్రికి బిడ్డల మౌతాం - మత్త 5,45

నరునికి దేవునిలాంటివాణ్ణి కావాలనే కోరిక మొదటినుండీ వుంది. ఆదాము చెట్టపండు తినడంలో ఉద్దేశం ఇదే - ఆది 3,5. కాని ఆదాము దురాశకూ గర్వానికీ ప్రభువు అతన్ని శపించాడు. మరి నరుల్లోని ఈ కోరిక ఏలా తీరుతుంది? సోదరప్రేమను పాటించడం ద్వారా మనం తండ్రికి ఇష్టులమై అతనికి కుమారులమౌతాం. అనగా అతనిలాంటివాళ్ళమౌతాం - మత్త 5,45. కనుక ఈ సోదరప్రేమ అవశ్యం పాటించదగ్గది.


2. యోహాను భావాలు

1. యోహాను సువార్త

12. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు - యోహా - 3,16

ఇంతవరకు తొలిమూడు సువార్తల్లోని భావాలు పరిశీలించాం. ఇక యోహాను వ్రాసిన నాల్గవ సువార్తలోని భావాలు పరిశీలిద్దాం.

దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఇక్కడ లోకమంటే కేవలం యూద ప్రపంచం మాత్రమే కాదు. లోకంలోని జనులందరూను. విశేషంగా పాపాత్ములైన నరులు. ఈ నరులకోసం తండ్రి తన ఏకైక కుమారుణ్ణి, అనగా తనకు అత్యంత ప్రీతిపాత్రుడైన క్రీస్తుని పంపాడు. జనులు పాపాత్ములై దేవునికి శత్రువులుగా వున్నపుడు ఈ క్రీస్తు పాపుల కొరకు ప్రాణాలు అర్పించాడు - రోమా 5,8. ఈ కార్యాలన్నిటిద్వారా తండ్రికి మనపట్ల గల ప్రేమ వ్యక్తమౌతుంది. ఆదాము పాపం వల్ల నరులంతా దేవునికి శత్రువులయ్యారు. అలాంటి పరిస్థితుల్లో నరుల కొరకు రక్షణ ప్రణాళికను సిద్ధం చేసి క్రీస్తుని పంపాడు తండ్రి. క్రీస్తు తనంతట తాను రాలేదు. తండ్రి పంపగా వచ్చాడు. తండ్రి ప్రేమమయుడు. కనుక ప్రేమ అనేది మొదట మననుండి కాక దేవుని నుండి పుట్టింది. దేవుడు మొదట మనలను ప్రేమించాడు కనుకనే మన తరపున మనం కూడ ఆ దేవుణ్ణి తోడి నరుజ్జీ కూడ ప్రేమించగల్గుతున్నాం. మన ప్రేమకు ఆధారమూ ఆదర్శమూ కూడ ఆ తండ్రి ప్రేమే - 1 యోహా 4,10-12.