పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదుకొంటూనే వుంటాడుకదా! పైగా యోసేపు కష్టపడి పనిచేసేవాడు. నిజాయితీ, వివేకం, స్వామిభక్తి కలవాడు. కనుక అతడు ఎక్కడికి వెళ్లినా యజమానులకు ప్రీతిపాత్రుడు అయ్యేవాడు.

ఫరో సేవకుల కలలు

యోసేపు చెరసాలలోని ఖైదీలందరికీ పెద్దగా వుండేవాడు కదా! ఒకరోజు ఆ చెరలోకి ఇద్దరు క్రొత్త ఖైదీలు వచ్చారు. వారు ఫరోరాజు వంటవాడు, పానీయవాహకుడు. వీళ్ల వట్టి సేవకులు కారు, రాజోద్యోగులు. రాజుకి సలహాదారులుకూడ. ఏదో రాజకీయ నేరంపై చెరసాలలో త్రోయబడ్డారు. ఈ యిద్దరికీ కలలు వచ్చాయి. యోసేపు స్వప్నవ్యాఖ్యనంలో నిపుణుడు. అతడు ఆ యిద్దరి కలలకు అర్థం చెప్పాడు.

పానీయవాహకుడికి ద్రాక్షగుత్తులు పండి ఫరోకు ద్రాక్షరసం అందించినట్లుగా కల వచ్చింది. యోసేపు ఫరో అతన్ని మళ్లా కొలువులోకి తీసికొంటాడని అర్థం చెప్పాడు. అతడు చెప్పినట్లే మూడురోజుల తర్వాత ఫరో అతన్ని విడుదల చేయించి మల్లా కొలువు దయచేసాడు.

వంటవానికి తాను ఫరోచక్రవర్తికి పిండివంటలను గంపలో మోసికొని పోతూన్నటూ, ఆకాశంలోని పక్షులు ఆ పిండివంటలను తింటూన్నటూ కలవచ్చింది. యోసేపు అతనితో ఫరోచక్రవర్తి నీ తల తీయిస్తాడు అని చెప్పాడు, మూడురోజులయ్యాక చక్రవర్తి అతన్ని వురితీయించాడు. అంతా యోసేపు చెప్పినట్లే జరిగిoది.

యోసేపు పానీయవాహకునితో నీవు నాకు ఓ ఉపకారం చేసిపెట్టాలి. నన్ను హేబ్రేయుల దేశం నుండి అపహరించుకొని వచ్చారు. ఇక్కడ అన్యాయంగా ఈ చెరలో త్రోయించారు. నీవు ఫరోను కలసికొన్నపుడు ఆ రాజుకి నాసంగతి తెలియజేయి. ఆయనకు నాపై దయపుట్టేలా చూడు అని చెప్పాడు. కాని చెరనుండి విడుదల పొందిన పానీయవాహకుడు అతన్ని పూర్తిగా మర్చిపోయాడు. యోసేపు ఇంకా రెండేండ్లు ఆ చెరలోనే వ్రుగ్గవలసి వచ్చింది. దైవలీలలు విచిత్రంకదా! యోసేపుకి తరచుగా కష్టాలు వస్తాయి. ప్రభువు అతన్ని ఆ బాధలనుండి తప్పించినట్లే వుంటుంది. కాని అతడు మల్లా క్రొత్తకష్టాల్లో చిక్కుకొంటాడు. ఐనా అతడు నిరాశకు గురికాక విశ్వాసంతో ప్రభువుని నమ్ముతూంటాడు. దేవుడు అతన్ని కష్టపుబాటలో నడిపిస్తూంటాడు. ఐనా అతన్ని నిరంతరం ఆదుకొంటూనే వుంటాడు.