పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఖండిస్తాంగాని మెచ్చుకోం. ఐతే దావీదు పడిపోయినచోట యోసేపు గెల్చాడు. శోధనలు గెల్చినవాడు మహానుభావుడు. దేవునికీ భక్తకోటికీ ప్రీతిపాత్రుడు.

యోసేపు దృష్టాంతం నుండి మనం మూడంశాలు నేర్చుకోవాలి. 1. నరునికి ద్రోహం చేయడం కంటె దేవునికి ద్రోహం చేయడం గొప్ప పాపం. అతడు నేనీ స్త్రీని కూడ్డం భగవద్రోహం కాదా అనుకొన్నాడు — 39, 9. పాపంలోని దుష్టత్వమంతా దేవునికి ద్రోహం చేయడంలోనే వుంటుంది. "నేను నీకే, నీకే ద్రోహంగా పాపం చేసాను” - కీర్త 51,4

2. యోసేపకి పాపభీతివుంది. అతడు నేను ఈ దుష్కార్యానికి ఏలా వొడిగడతాను అనుకొన్నాడు. పాపాన్ని చులకన చేసేవాడు దానిలో కూలతాడు. పాపానికి జంకేవాడు దానికి దూరంగా వుంటాడు.

3. యోసేపు ఎప్పడూ దేవుణ్ణి తలంచుకొనేవాడు. దేవుని సన్నిధిలో నడచేవాడు. కష్టసుఖాల్లోను దేవుణ్ణి నమ్మి జీవించేవాడు. కనుకనే శోధనవచ్చినపుడు దైవబలంతో దాన్ని జయించగలిగాడు. భగవంతునిపట్ల మనకు ఎంత భక్తివుందో అంతగానే శోధనలను జయిస్తాం. పౌలు నుడివినట్లుగా, మనం ఆత్మయందు జీవించాలి. శారీరక వాంఛలను తృప్తిపరచకూడదు - గల 5, 16

యోసేపుకి శిక్ష

దేవుడు యోసేపు పుణ్యాన్ని గుర్తించి అతన్ని బహూకరిస్తాడని మనం భావించి వుండవచ్చు. కాని అలాయేమి జరగలేదు. పోతీఫరు భార్య యోసేపు తన కోర్మెను తీర్చనందుకు అతనిపై కోపించింది. అతడు తన్ను చులకన చేసి అవమానించినట్లుగా భావించింది. తన చేతికి జిక్కిన యోసేపు పైబట్టను భర్తకు చూపించి అతడు తన్ను మానభంగం చేయడానికి లోనికి వచ్చాడని పెనిమిటికి ఫిర్యాదు చేసింది. ఆడవాళ్లు అబద్ధం చెస్తే గోడకట్టి నట్లుగా వుంటుంది కదా! ఆలిమాటలు నమ్మి పోతీఫరు యోసేపని చెరలో త్రోయించాడు. అంతటి పెద్ద అధికారి అతన్ని చంపించి వుండవచ్చు. ఇక్కడ ఆ కార్యం అతడు ఎందుకు చేయలేదా అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది. సరే, యోసేపు పుణ్యానికి బహుమతికి మారుగా శిక్షపడింది. ఐనా అతడు దేవుని మార్గాలను అర్థం చేసికొని ఓర్పుతో చెరలో వుండిపోయాడేగాని ఆ ప్రభువుపై సుమ్మరలు పడలేదు.

ఐతే చెరలో దేవుడు యోసేపుకి తోడుగా వున్నాడు. చెరసాల అధికారికి అతనిపై దయపట్టేలా చేసాడు. కనుక ఆ యధికారి చెరలోని వారనందరినీ యోసేపకి అప్పగించాడు. అతన్ని వారికి నాయకుణ్ణి చేసాడు. భగవంతుని నమ్మినవాళ్లను ఆ ప్రభువు ఎప్పడు