పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రేషుడు. ఆయన నేను జన్మింపక పూర్వంనుండే వున్నాడు" అనే యోహాను వాక్యాలనే యెత్తి చూపి అతని శిష్యులు నోరుమూయించేది - యోహా 1,15. యోహాను పెండ్లి కుమారుడైన క్రీస్తుకి నిజమైన మిత్రుడు. అతడు క్రీస్తునిగాంచి సంతోషించినవాడు. ఆలాంటివాడు క్రీస్తుతో పోటీకిరాడు. పైగా అతడు వినయవంతుడు. కనుకనే క్రీస్తు హెచ్చాలి, నేను తగ్గాలి అన్నాడు — 3,27-30. అతడు క్రీస్తుని చూచి అసూయ పడలేదు కదా, తన శిష్యులను గూడ క్రీస్తు పరంజేసాడు - 1,35-37.

క్రీస్తు తన తరపున తాను యోహానుని స్తుతించాడు. అతడు దేదీప్యమానంగా వెలిగే దీపమన్నాడు – 5,35. నరుల్లో అతనికంటె అధికుడు లేడన్నాడు — మత్త 11, 11. ఇవి గొప్ప ప్రశంసా వాక్యాలు. కాని క్రీస్తు ఈ సందర్భంలోనే పరలోక రాజ్యంలో మిక్కిలి తక్కువవాడు కూడ యోహాను కంటె గొప్పవాడౌతాడన్నాడు – 11, 11. ఈ వాక్యం యోహానుని తక్కువ చేయదు. నూత్నవేద వరప్రసాదం పూర్వవేద వరప్రసాదం కంటె గొప్పదని మాత్రమే క్రీస్తు ఉద్దేశం. వినయవంతుడూ పెండ్లి కుమారునికి మిత్రుడూ ఐన యోహానుని గూర్చి నాల్గవ సువిశేషం ఈలా చెప్పంది. “అతడు వెలుగు కాదు. వెలుగుకి సాక్ష్యమీయడానికి వచ్చినవాడు. తన ద్వారా అందరూ క్రీస్తుని విశ్వసించడానికి అతడు వెలుగుకి సాక్ష్యమీయడానికి వచ్చాడు” - 1,7-8. కనుక యోహాను సాక్ష్యాన్ని జూచి మనం క్రీస్తుని ఇంకా అధికంగా విశ్వసించాలి.

యోహాను పూర్వ నూత్న వేదాల సంధికాలంలో వున్నవాడు. అతని రాకడతో పూర్వ నూత్న వేదాలు ఒకదానితో ఒకటి కలసిపోయాయి. అతనితో మెస్సీయా ఆగమనం ప్రారంభమైంది. ఆ మెస్సీయా ద్వారానే పూర్వనూత్నవేద గ్రంథాలు అర్థవంతమౌతాయి.

ప్రార్థనా భావాలు

1.యోహానులో కన్పీంచే ఓ ముఖ్యగుణం అతని వినయం. క్రీస్తు బహిరంగ జీవితం ప్రారంభిచకముందు యోహానుకి గొప్పప్రసిద్ధి ఉండేది. అలాంటివాడు క్రీస్తకంటపడగానే అతడు హెచ్చాలి, నేనుతగ్గాలి అన్నాడు - యోహ 3,30. తాను వచ్చింది మెస్సీయాకు మార్గం సిద్ధంజేయడానికి. తానే ముఖ్యంకాదు. మెస్సీయా ముఖ్యం. కనుక యోహాను తన వుద్యమాన్ని తన ప్రాముఖ్యాన్ని వదులుకొని క్రీస్తుని నాయకుణ్ణిగా అంగీకరించాడు. 2. అతని నిర్భీకతగూడ మెచ్చుకోదగిన గుణం, అతడు నరుల అంతస్తకీ అధికారానికీ భయపడలేదు. హేరోదు అంతటివాణ్ణి నిలదీసి నీవు నీ తమ్ముని భార్యని ఉంచుకోవడం ధర్మం కాదని గర్జించాడు - మత్త 14,4. దినికి ప్రాణాలు సమర్పింపవలసివచ్చినా అతడు వెనుదీయలేదు.

3. యోహాను ఎడారిలో దైవప్రబోధంపొంది కటొర జీవితవిధానాన్ని అవలంబించాడు - మార్కు 1,6. క్రీస్తుకి సాక్ష్యం పలకడం అనే తన ధ్యేయాన్ని భక్తి శ్రద్ధలతో నెరవేర్చాడు. మహానుభావుల నిష్ట ఈలా వుంటుంది.